హైదరాబాద్ రియల్ బ్రాండ్
హైదరాబాద్ మహానగరం రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్నది. గతంతో పోల్చితే ప్రజలు భూములపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. 2024 మొదటి త్రైమాసికంలో (మొదటి మూడు నెలల్లో) రూ.23,580 కోట్ల విలువైన రియల్ వ్యాపారం జరిగిందని ప్రాప్ టైగర్స్ అనే ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది.
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 20 (విజయక్రాంతి) : రియల్ ఎస్టేట్ ఇన్ సైట్ రెసిడెన్షియల్ అనే అంశంపై నిర్వహించిన సర్వేలో రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ మహానగరం టాప్‌లో ఉన్నట్లు ‘ప్రాప్ టైగర్స్’ అనే ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ సంస్థ వెల్లడించింది. 2024 మూడు నెలల వ్యవధిలోనే 3.5 కోట్ల చదరపు అడుగుల మేర స్థిర, చర ఆస్తుల క్రయవిక్రయాలు జరిగాయని ఆ సంస్థ వెల్లడించింది. 2023 వార్షిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కేవలం రూ.9,711 కోట్ల విలువైన ప్లాట్లు, ఇండ్ల క్రయ విక్రయాలు జరిగాయి. 2023 త్రైమాసికంలో జరిగిన వ్యాపారంతో పోల్చితే.. 2024 మొదటి త్రైమాసికంలో ఏకంగా 143 శాతం హైదరాబాద్ నగరంలో రియల్ వ్యాపారం వృద్ధ్దిని నమోదు చేసుకున్నట్లు ఆ సంస్థ తన నివేదికలో పేర్కొంది.
అలాగే హైదరాబాద్ నగరంతో పోటీ పడుతూ ముంబై నగరంలోను 3.3 చదరపు అడుగుల మేర క్రయ, విక్రయాలు జరిగినట్లు ప్రాప్ టైగర్స్ సంస్థ తన నివేదికలో తెలిపింది. అలాగే హైదరాబాద్‌తో పోల్చితే ముంబై మెట్రో రీజియన్ పరిధిలో ధరలు మూడు రెట్లు ఎక్కువ ఉండటంతో ఆ ప్రాంతంలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ యూనిట్లను నిర్మిస్తున్నారని, దీంతో యూనిట్ల అమ్మకంలో హైదరాబాద్ కంటే ముంబై ముందంజలో ఉందని ఆ సంస్థ తన నివేదికలో స్పష్టం చేసింది. అయితే 2023లో రికార్డు స్థాయిలో 32,880 హౌసింగ్ యూనిట్ల అమ్మకాలు జరిగాయని, రెసిడెన్షియల్ లాంచ్‌లు కూడా ఏడు శాతం వృద్ధ్ది నమోదు చేసుకొని 46,985 యూనిట్లకు చేరుకున్నాయి. కిందటి సంవత్సరం డిసెంబర్‌లో ఇండియా రియల్ ఎస్టేట్, రెసిడెన్షియల్ ఆఫీస్ మార్కెట్‌పై ‘నైట్ ఫ్రాంక్ ఇండియా’ అనే సంస్థ తన నివేదికలో ఈ విషయం వెల్లడించింది.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఏర్పడిన అనిశ్చితి, రాజకీయ అస్థిరత కారణంగా రియల్ ఎస్టేట్ రంగం కొంత వరకు ఇబ్బందులను ఎదుర్కొన్న మాట వాస్తవం. ఆ సమయంలో హైదరాబాద్ కేంద్రంగా స్థిరాస్థి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. కానీ 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం రావడం, పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ, అంతర్జాతీయ స్థాయి శాంతి భద్రతల ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలలో కూడా భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.
ప్రత్యేక రాష్ట్రంలో గణనీయ వృద్ధ్ది..
హైదరాబాద్ మహానగరాభివృద్ధ్ది సంస్థ పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా పుంజుకుంది. దీంతో 2014 కంటే ముందున్న పరిస్థితితో పోల్చితే 2023లో రియల్ ఎస్టేట్ రంగం సుమారు 50 రెట్లు పెరిగింది. కోటి రూపాయలు మించి ఖరీదైన ఇండ్ల అమ్మకాలు గడిచిన ఐదేండ్లలో రెట్టింపయ్యాయి. 2018లో మొత్తం అమ్మకాల్లో ఖరీదైన ఇండ్ల అమ్మకాలు 21శాతం ఉండగా, 2023లో ఏకంగా 49శాతం పెరిగాయి. అలాగే 2022లో 11,632 యూనిట్లు అమ్ముడవగా, 2023లో 16,086 యూనిట్లకు ఖరీదైన నిర్మాణాల అమ్మకాలు పెరిగాయి. అలాగే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీలు) తమ ఐటీ, బ్యాక్ ఆఫీసు కార్యకలాపాలను, కార్పోరేట్ వ్యవహారాలను హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తుండటంతో 2023లో హైదరాబాద్ ఆఫీసు మార్కెట్ వార్షిక లావాదేవీల్లో 32శాతం పెరుగుదల నమోదైంది.
మరింత ఉజ్వల భవిష్యత్తు
సాధారణంగా బహులజాతి సంస్థలు తమ కార్పొరేట్ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలంటే ప్రధానంగా విశాలమైన రోడ్లు, అంతర్జాతీయ స్థాయి శాంతి భద్రతలు, సుస్థిర ప్రభుత్వం, అందుబాటు ధరలలో భూముల లభ్యత వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే విశాలమైన రోడ్డు రవాణా వ్యవస్థతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వేస్, మెట్రోరైల్, ఎంఎంటీఎస్ వంటి ప్రజా రవాణా మార్గాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు, ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు, మెరుగైన శాంతి భద్రతలున్న హైదరాబాద్ మహానగర పరిధిలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తుండటంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా సాగుతున్నది.
ఇతర నగరాలతో పోల్చితే..
బెంగుళూరు, చెన్నై, ముంబై ఢిల్లీతో పాటు అత్యంత వేగంగా అభివృద్ధ్ది చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రభాగంలో ఉందని చెప్పవచ్చు. అయితే ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్ ది బెస్ట్ లివబుల్ సిటీ అని గతంలో మెర్సన్ అనే అంతర్జాతీయ సంస్థ ప్రకటించిన సంగతి విధితమే. అలాగే చెన్నైలో వరదలు, ఢిల్లీలో కాలుష్యం, బెంగుళూరులో నీటి సమస్యలు నిత్యకృత్యమయ్యాయి. అలాగే ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై వంటి నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో లివింగ్ కాస్ట్ తక్కువ. కాబట్టి పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామంగా మారుతుందని, భవిష్యత్తులోనే హైదరాబాద్ రియల్ బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గదని స్థిర, చరాస్తి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






