5 June, 2026 | 6:21 PM

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

05-06-2026 05:23 PM

హైదరాబాద్: ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం రోజున హైడ్రా(HYDRA) భారీ ఆప‌రేష‌న్ చేపట్టింది. ప్ర‌కృతిని ప‌రిర‌క్షిస్తూ చారిత్ర రాళ్ల గుట్ట‌ల‌తో పాటు, ఆతి పురాతన రాతి గుహలు, వాటి మ‌ధ్య‌న ఉన్న  చెట్టూ, చేమ‌ను హైడ్రా అధికారులు కాపాడారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండ‌లం పుప్పాల‌గూడ - ఖాజాగూడ స‌రిహ‌ద్దుల్లో శుక్ర‌వారం 198 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఇందులో 250 కోట్ల సంవ‌త్స‌రాల చారిత్ర‌క రాళ్ల గుట్ట‌లు కూడా ఉన్నాయి.  గ‌తంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం హెచ్ ఎండీఏకు కేటాయించిన 200ల‌ ఎక‌రాలు కూడా ఉన్నాయి.

చారిత్ర‌క గుట్ట‌ల‌ను కాపాడాల‌ని కోరుతూ ద‌శాబ్దాలుగా `సొసైటీ టూ సేవ్ రాక్స్‌` ప్ర‌తినిధులు పోరాడుతున్నారు. హైకోర్టును కూడా వీరు ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు రాతి గుట్ట‌ల‌తో పాటు.. ప్ర‌భుత్వ భూమిని కాపాడాల‌ని 2019లో మున్సిప‌ల్‌, రెవెన్యూ శాఖ‌ల‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. హ‌ద్దులు గుర్తించి ఫెన్సింగ్ వేయ‌డం జాప్యం కావ‌డంతో కోట్లు విలువ చేసే భూమి క‌బ్జాల‌కు గురైంది. ఇదే విష‌యాన్ని సొసైటీ టూ సేవ్ రాక్స్‌ ప్ర‌తినిధులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. రెవెన్యూ, మున్సిప‌ల్ శాఖ‌ల అధికారులతో క‌లిసి హైడ్రా అధికారులు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. ప్ర‌భుత్వ భూమిగా నిర్ధారించుకుని శుక్ర‌వారం ఫెన్సింగ్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ భూమి విలువ‌ రూ. 30వేల కోట్లు వ‌ర‌కూ ఉంటుంద‌ని హైడ్రా అంచ‌నా వేసింది.