31 May, 2026 | 2:17 AM

నటుడిగా నిరూపించుకునేందుకే శ్రీనివాస మంగాపురంతో వస్తున్నా

31-05-2026 01:40 AM

డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ హీరోగా పరిచయమతున్నాడు జయకృష్ణ ఘట్టమనేని. ఈ సినిమా వైలెంట్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోంది. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతోంది. అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్‌పై , జెమినీ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 9న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా శ్రీనుఅండ్‌మంగా పాత్రలను పరిచయం చేస్తూ  హైదరాబాద్‌లో శనివారం ఓ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. “శ్రీనివాస మంగాపురం’ అనే పేరు పెట్టడమే ఈ సినిమా మొదటి విజయం. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. రోజూ వెంకటేశ్వర స్వామి హుండీలో ఎన్ని కోట్లు పడతాయో, అన్ని కోట్ల కలెక్షన్లు ఈ సినిమాకు రావాలని కోరుకుంటున్నా” అన్నారు.

అశ్వినీదత్ మాట్లాడుతూ.. “ఈ సినిమా జూలై 9 మీ ముందుకు వస్తోంది. నేను ఇండస్ట్రీలోకి వచ్చి 52 సంవత్సరాలు అయింది. రాఘవేంద్రరావు లేకపోతే నేను ఈ స్థాయి లో ఉండేవాడిని కాదు. నాకు సహకరించిన నటీనటులు, టెక్నీషియన్లు అందరికీ నా కృతజ్ఞతలు” అన్నారు. చిత్ర కథానాయకుడు జయకృష్ణ ఘట్టమనేని మాట్లాడుతూ.. “తాతయ్య నాకు దేవుడితో సమానం. ఆయన ఆశీస్సులు నాతో ఉంటాయని నమ్ముతున్నా. అజయ్ భూపతి చెప్పిన ‘శ్రీనివాస మంగాపురం’ కథలోని ఎమోషన్స్, నా పాత్రలోని డెప్త్ చాలా ఆకట్టుకున్నాయి.

ఈ క్యారెక్టర్ ద్వారా నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవచ్చని, నటుడిగా నిరూపించుకునే అవకాశం దొరుకుతుందని భావించా. హీరో అవ్వాలనే ఆలోచనకు ప్రేరణ మా తాతయ్య. రాషా అద్భుత నటి. చాలా మంచి మనిషి. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటుంది. తనతో కలిసి నటించడం చాలా ఆనందంగా అనిపించింది. మోహన్‌బాబు, నరేశ్ వంటి లెజెండరీ నటులతో కలిసి నటించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. నేను మహేశ్ బాబాయ్‌కి డైహార్డ్ ఫ్యాన్ని. ఎప్పటికప్పుడు నాకు ఫీడ్‌బ్యాక్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు” అన్నారు.

హీరో యిన్ రాషా తడాని మాట్లాడుతూ.. “ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. జయకృష్ణతో కలిసి నటించడం చాలా మంచి అనుభవం. ఈ సినిమా నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రత్యేక ప్రాజెక్ట్‌గా నిలుస్తుంది” అని చెప్పింది. డైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ.. “కృష్ణ నిజమైన సూపర్ స్టార్. ఆయన చేసినంత రిస్క్ ఏ హీరో చేసి ఉండరు. కృష్ణ క్వాలిటీస్ జయకృష్ణలో ఉన్నాయి.

కచ్చితంగా జయకృష్ణ చాలా పెద్ద హీరో అవుతాడు. జయకృష్ణ స్క్రీన్‌ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. రాషా, జయకృష్ణ పోటీపడి నటించారు. ఇది దాదాపు పూర్తిగా అవుట్‌డోర్‌లో తెరకెక్కించిన సినిమా. ఆ ఫీల్ మీకు సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఆదిశేషగిరిరావుతోపాటు మూవీ టీమ్ పాల్గొన్నారు.