17 June, 2026 | 1:42 AM

మీ కాల్ కోసం ఎదురుచూస్తున్నా!

17-06-2026 12:46 AM
  1. కేంద్ర రైల్వేశాఖ మంత్రితో సమావేశం ఏర్పాటు చేయించండి
  2. కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ బహిరంగ లేఖ 

హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో ఫేజ్- 2 విస్తరణకు అవసరమైన కేంద్రం అనుమతులతో పాటు ఐఆర్‌ఎఫ్‌సీ రుణ నిధుల విడుదల మరింత జాప్యం చేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. ఈ అంశంపై చర్చించేందుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని, ఆ కాల్ కోసం ఎదురుచూసున్నానని లేఖ రాశారు.

పెరిగిన జనాభా, నగర విస్తరణకు అనుగుణంగా మెట్రో నెట్‌వర్క్ విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్- 2 ప్రతిపాదనలను కేంద్రానికి సమ ర్పించింది. మొత్తం ఏడు కారిడార్లు, 122.9 కిలోమీటర్ల మార్గం, సుమారు 38,595 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రతిపాదనలు ఇచ్చింది. ఫేజ్-1 ప్రైవేటు నిర్వహణలో ఉండటం, ఫేజ్-2 వేరే సంస్థాగత విధానంలో అమలు చేయటంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తెలిపిన అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మకంగా స్వీకరించింది అని సీఎం ఈ లేఖలో వివరించారు.

ఫేజ్-1 స్వాధీనం ప్రక్రియలో ఈక్విటీ కొనుగోలుకు రూ. 1,461.47 కోట్లు, ప్రాజెక్టు అప్పుల రీఫైనాన్సింగ్‌కు రూ. 13,538.53 కోట్లు కలిపి మొత్తం 15 వేల కోట్ల లావాదేవీలున్నాయి. ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ పారదర్శకంగా నిర్వహించింది. ఈ కమిటీకి కేంద్ర ప్రభుత్వం తరఫున యూపీఎంఆర్సీఎల్ ఎండీ సుశీల్‌కుమార్‌ను సభ్యుడిగా నామినేట్ చేసిందని సీఎం లేఖలో గుర్తుచేశారు. 

ఒప్పందాలన్నీ పూర్తయ్యాక, అన్ని షరతులు నెరవేర్చాక, 2026 జూన్ 15న రావాల్సిన మొదటి విడత రుణం విడుదల కాలేదని సీఎం ప్రస్తావించారు. తాము ఎలాంటి దానం అడగటం లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన  ఒప్పందం ప్రకారం ఐఆర్‌ఎఫ్‌సీ రుణాన్ని విడుదల చేయించాలని కోరుతున్నామని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి  కిషన్‌రెడ్డి ఈ విషయంలో బాధ్యత తీసుకుని ఐఆర్‌ఎఫ్‌సీ ద్వారా మంజూరైన రుణం విడుదలయ్యేలా చూడాలని కోరారు.