16 April, 2026 | 11:28 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

నేను రాను బిడ్డో.. నల్లగొండ సర్కారు దవాఖానకు!

14-06-2025 12:00 AM

నిండా అలుముకున్న నిర్లక్ష్యం వణికిపోతున్న గర్భిణులు

నల్లగొండ, జూన్ 13( విజయక్రాంతి) :పేరుకే పెద్దాస్పత్రి.. కానీ అక్కడ నిర్లక్ష్యమే అంతా రాజ్యమేలుతుంది. కూతవేటు దూరంలో ఓవైపు కలెక్టరేట్.. మరోవైపు డీఎంహెచ్‌ఓ కార్యాలయం.. నిత్యం ఆ ఆస్పత్రి ముందు నుంచే జిల్లా యంత్రాగమంతా రాకపోకలు సాగిస్తుంది. ఏటా రూ.కోట్ల నిధులు.. సరిపడా సిబ్బంది. అయినా అక్కడ మాత్రం వైద్య సేవలకు సుస్తీ  చేసింది.

అదే నల్లగొండ జిల్లా కేంద్రాస్పత్రి. జిల్లా కేంద్రాస్పత్రి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు)ల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నెలనెలా ఠంఛనుగా రూ.వేలకు వేలు వేతనాలు తీసుకుంటున్నా.. పేదలకు వైద్య సేవలు అందించమంటే.. మాత్రం ఎక్కడా లేని విసుగొస్తుంది. తాము చేయాల్సిన డ్యూటీనే కొండంత భారంగా ఫీలవుతుంటారు అక్కడి సిబ్బంది.

నల్లగొండ జిల్లా కేంద్రాస్పత్రికి వైద్యం కోసం వస్తే చాలు.. ఎక్కడా లేని అవమానాలు.. చీదరింపులు.. ఛీత్కారాలు.. ఓపీ చిటీ రాయించుకోవడం దగ్గరి నుంచి మొదలుపెడితే.. చివరికి మెడిసన్ తీసుకుని వెళ్లేంత వరకు అడుగడుగునా అవమానాలే. అక్కడికి వైద్య సిబ్బంది తమ ఇంట్లో నుంచి ఏదో తెచ్చి పెడుతున్నట్టుగా ఫీలవ్వడం అక్కడ షరా మాములే. ఇక ఇన్పేషంట్ల బాధ వర్ణనాతీతం.

వరుస ఘటనలతో రోగుల పరార్..

నల్లగొండ జిల్లా కేంద్రాస్పత్రిలో నిత్యం వేలసంఖ్యలో రోగులు వైద్యం కోసం వస్తుంటారు. కానీ ఆస్పత్రిలో మాత్రం చికిత్స దొరకడం.. తిరుపతికి వెళితే.. శ్రీవారి దర్శనం అయినంత భాగ్యమనే చెప్పాలి. పేరుకు జిల్లాస్పత్రిలో వైద్యుల కొరత లేదని అధికారులు చెబుతుంటారు. కానీ వైద్యం కోసం వచ్చిన రోగుల చికిత్స అందించేందుకు మాత్రం డాక్టర్లు అందుబాటులో ఉండకపోవడం ఇక్కడ నిత్యకృత్యమే.

ఓపీ కోసం వచ్చేవారి దగ్గరి నుంచి అత్యవసర సేవల విభాగం వరకు నిండా నిర్లక్ష్యం అలుముకుంది. సరిగ్గా రెండు రోజుల క్రితం నల్లగొండ జిల్లా కేంద్రాస్పత్రిలో కుర్చీలోనే మహిళ ప్రసవించిన దారుణ ఘటన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత సైతం ఇలాంటి ఘటనలు కోకొల్లలు.

పసికందును చంపేశారు..?

గుడిపల్లి మండలం కేశినేని తండాకు చెందిన జటావత్ ఝాన్సీ మొదటి కాన్పు కోసం ఈనెల 6 వ తేదీన నల్లగొండ జిల్లా కేంద్రాస్పత్రిలో అడ్మిట్ అయింది. బుధవారం ఝాన్సీకి పురిటి నోప్పులు రావడంతో విషయాన్ని కుటుంబ సభ్యులు వైద్యులకు తెలపగా, ఝాన్సీకి టాబ్లెట్ ఇచ్చారు.

దీంతో ఆమెకు పురిటినొప్పులు తగ్గాయి. అయితే ఆమెకు చికిత్సనందిస్తున్న క్రమంలో గురువారం పురిటినొప్పులు రావడంతో పరిశీలించిన డాక్టర్లు స్కానింగ్ రాసి అనంతరం పరిశీలించగా కడుపులోని పాప చనిపోయిందని నిర్ధారించారు. మృత శిశువును డాక్టర్లు డెలివరీ చేశారు. అనంతరం తల్లి పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి రీఫర్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో ఝాన్సీ వెంటి లెట్ప చికిత్స పొందుతోంది.

ప్రభుత్వాస్పత్రిలో రక్షణ కరువు..

నల్లగొండ జిల్లా కేంద్రాస్పత్రి గత రెండుమూడు ఏండ్లుగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ప్రభుత్వాస్పత్రిలో వైద్య సిబ్బంది తీరే కాదు.. అక్కడి పరిస్థితులు సైతం అంతే. గతంలో ప్రభుత్వాస్పత్రి ఆవరణలో ఆస్పత్రికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు ఏండ్ల తరబడిగా నివాసం ఉండడం..

వారికి సంబంధించిన బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా రెండు రోజుల క్రితం సైతం ఓ మహిళా 23నెలల బాలుడిని కిడ్నాప్ చేయడం.. పోలీసులు 7 గంటల్లోపే కిడ్నాప్ కేసును చేధించడం చకాచకా జరిగిపోయాయి. నిజానికి ప్రభుత్వాస్పత్రిలో ఒక్కటంటే ఒక్క సీసీ కెమెరా లేకపోవడం కొసమెరుపు.