బీఆర్‌ఎస్‌లో చేరుతలేను
- పార్టీ మారుతానని, కేసీఆర్‌తో కలుస్తానని నాపై కొందరి దుష్ప్రచారం
- పార్టీలు మారడం బట్టలు మార్చినంత సులభం కాదు
- బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
మేడ్చల్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): తాను పార్టీ మారుతానని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచా రాన్ని ఎవరు నమ్మవద్దని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం పూడూరులోని ఆయన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. పార్టీలు మారడం బట్టలు మార్చినంత సులభం కాదన్నారు. తాను మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి వెళ్తానని, కేసీఆర్‌తో కలుస్తానని కొంతమంది పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
కేసీఆర్ తనను పార్టీ నుంచి పంపించి ఐదేళ్లు అయిందని, భర్తరఫ్ చేయడమే గాక అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని గుర్తుచేశారు. కోళ్ల ఫారాలు కూల్చారని, భూము లు గుంజుకున్నారని, లీగల్‌గా కొనుగోలు చేసిన భూములు కూడా చెరపట్టారని విమర్శించారు. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న తాను పార్టీ ఎలా మారుతానని ప్రశ్నించారు. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని, మంత్రి పదవి ఆఫర్ చేశారని, ఉద్యమంలో కమిట్‌మెంట్‌తో ఉన్నందున పార్టీ మారలేదన్నారు.




