19 April, 2026 | 9:13 AM

నేను క్యాంటీన్‌కు వెళ్లను టీచర్

26-08-2024 04:45 AM
  1. మహారాష్ట్రలోని స్కూల్‌లో బాలికపై క్యాంటీన్ వర్కర్ లైంగిక వేధింపులు 
  2. టీచర్ మందలించగా విషయం బయటపెట్టిన బాలిక 
  3. నిందితుడి అరెస్టు, పోక్సో కేసు నమోదు

ముంబై (మహారాష్ట్ర), ఆగస్టు 25: ఓ వైపు కోల్‌కతాలోని వైద్య విద్యార్థిని హత్యాచారం, బద్లాపూర్ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై పాఠశాల స్వీపర్ లైంగిక దాడి వంటి ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుంటే.. మరోవైపు దేశంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిర్భయ వంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ అమ్మాయిలను ఆటబొమ్మలా చూసే క్రూర మృగాల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో ఏడేళ్ల బాలికపై క్యాంటీన్ వర్కర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. 

వాసాయి ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడేళ్ల చిన్నారి క్యాంటీన్‌కు వెళ్లేందుకు నిరాకరించడంతో క్లాస్ టీచర్‌కు అనుమానం వచ్చి.. ‘ఎందుకు క్యాంటీన్‌కు వెళ్లనంటున్నావ్.. అక్కడ నీకు ఏం ప్రాబ్లం ఉంది’ అని బుజ్జగించింది. దీంతో ఆ బాలిక భోరున విలపించి.. ‘తనతో క్యాంటీన్ అంకుల్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నాడు ’ అని టీచర్‌కు చెప్పింది. జరిగిన విషయాన్ని వెంటనే టీచర్ ప్రిన్సిపాల్, బాలిక తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది.

వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. క్యాంటీన్ వర్కర్‌ను అదుపులోకి తీసుకోవడంతో పాటు అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. అతడు కేవలం ఈ ఒక్క బాలికతోనే ఇలా ప్రవర్తించాడా లేక మిగితా బాలికలతో కూడా ఇలాగే ప్రవర్తించేవాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడు యూపీ రాష్ట్రానికి చెందినవాడని.. రెండు నెలల క్రితమే క్యాంటీన్‌లో పనికి కుదిరాడని సమాచారం. కాగా ఆ పాఠశాలలో ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు దాదాపు 2,200మంది విద్యార్థులు చదువుతున్నారు.