19 April, 2026 | 11:02 AM

ఓపీఎస్.. ఎన్‌పీఎస్.. యూపీఎస్

26-08-2024 04:43 AM
  1. పెన్షన్ స్కీమ్‌లపై ఎడతెగని వివాదాలు 
  2. ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను పక్కనబెట్టిన కేంద్రం 
  3. కొత్త పెన్షన్ స్కీమ్‌తో మొదలైన వివాదం 
  4. తాజాగా యూనిఫైడ్ పెన్షన్ స్కీం తెచ్చిన సర్కారు

న్యూఢిల్లీ, ఆగస్టు 25: ప్రభుత్వ ఉద్యోగులు అత్యంత ముఖ్యంగా భావించేవాటిలో పీఆర్సీతోపాటు పెన్షన్ స్కీమ్ కూడా ఎప్పుడూ ఉంటుంది. కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి రావటానికి ముందు ఉద్యోగులకు సుదీర్ఘకాలంగా కొనసాగిన ఒకటే పెన్షన్ స్కీమ్ ఉండేది. దానినే ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) అంటున్నారు. దాన్ని పక్కనబెట్టిన మోదీ సర్కారు కొత్త పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్)ను తీసుకొచ్చింది.

దీంట్లో తమ ప్రయోజనాలకు ప్రభుత్వం దారుణంగా కోత పెట్టిందని ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ అంశం చిలికిచిలికి గాలివానగా మారి.. ఎన్నికల ప్రచారాస్త్రంగా కూడా మారింది. దీంతో కేంద్రం ఎన్‌పీఎస్‌లో కొద్ది మార్పులు చేస్తూ యూపీఎస్‌ను తీసుకొచ్చింది. కేంద్ర క్యాబినెట్ శనివారం ఈ పెన్షన్ స్యీమ్‌కు ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. దీనిపై కూడా కొన్ని ఉద్యోగు సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. మరి ఈ యూపీఎస్‌లో ఏముంది?

  1. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ కొత్త పెన్షన్ స్కీమ్ ప్రారంభమవుతుంది. 
  2. యూపీఎస్‌లోని మొత్తం ప్రయోజనాలు పొందాలంటే ఉద్యోగి కనీసం 25 ఏండ్ల సర్వీసు పూర్తిచేసి ఉండాలి. 
  3. ఉద్యోగి రిటైర్మెంట్‌కు 12 నెలల ముందు వరకు పొందిన వేతనంలోని బేసిక్ పే ఎంత ఉంటుందో అందులో సగం అంటే 50 శాతం వారికి నెలనెలా పెన్షన్‌గా లభిస్తుంది. 
  4. రిటైర్మెంట్ అయిన ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి ఆ ఉద్యోగికి మరణం సమయంలో ఎంత పెన్షన్ వస్తున్నదో అందులో 60 శాతం లభిస్తుంది. 
  5. కనీసం పదేండ్లు సర్వీస్ పూర్తిచేసుకొని రిటైర్ అయిన ఉద్యోగికి వేతనంతో సంబంధం లేకుండా కచ్చితంగా నెలకు రూ.10 వేల పెన్షన్ లభిస్తుంది.  
  6. పెన్షన్‌తోపాటు ఉద్యోగికి రిటైర్‌మెంట్ సమయంలో ఒకేసారి కొంత మొత్తం నగదును ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రతి ఆరు నెలల కాలంలో ఉద్యోగి చివరిసారి తీసుకొన్న నెల వేతనం (డీఏతో కలిపి) ఎంత ఉంటుందో అందులో పదో వంతును గణించి చెల్లిస్తారు. 
  7. పెన్షన్‌లో ప్రధాన సమస్య ద్రవ్యోల్బణ సర్దుబాటు. యూపీఎస్ ప్రకారం సర్వీసులో ఉన్న ఉద్యోగికి ఎలా అయితే డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) చెల్లిస్తారో. పెన్షనర్‌కు కూడా అలాగే చెల్లిస్తారు. 
  8. ఇప్పటికే రిటైర్ అయిన ఉద్యోగులు కూడా 2025, ఏప్రిల్ 1 తర్వాత యూపీఎస్‌కు మారొచ్చు. 

యూపీఎస్‌పై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. ఎన్‌పీఎస్‌కే కొత్త రంగేసి యూపీఎస్‌ను తీసుకొచ్చారని ఆరోపిస్తున్నాయి.  

యూ అంటే మోదీ యూటర్న్

న్యూఢిల్లీ, ఆగస్టు 25: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీమ్‌ను ప్రకటించటంపై కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. ‘యూపీఎస్‌లో యూ అంటే నరేంద్రమోదీ ప్రభుత్వ యూటర్న్. జూన్ 4వ తేదీ తర్వాత ప్రధానమంత్రి అహంకారాన్ని ప్రజలు దించారు. అందుకే బడ్జెట్‌లో క్యాపిటల్ గెయిన్స్‌పై వెనక్కు తగ్గింది. వక్ఫ్ బిల్లును జేపీసీకి పంపింది. బ్రాడ్‌కాస్ట్ బిల్లుపై యూటర్న్ తీసుకొన్నది. లేటరల్ ఎంట్రీపై యూటర్న్ తీసుకొన్నది’ అని ట్వీట్ చేశారు. ఖర్గేకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది.