23 July, 2026 | 2:16 AM

అభిమానులు ఎదిగితేనే నాకు నిజమైన సంతోషం

23-07-2026 01:41 AM

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరిప్రియ జంటగా నటిస్తున్న సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ’. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయిరాజేశ్ నిర్మిస్తున్నారు. సాయిరాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ బుధవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. “ఈ మూవీ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ’ అనగానే ఆ రోజులన్నీ మదిలో మెదిలాయి. వీళ్లంతా నా మీద పెంచుకున్న అభిమానం, ప్రేమ నన్ను ఈ  వేదిక మీద నిలబడేలా చేశాయి. నా అభిమానులు ఎదిగితే ప్రాణప్రదంగా చూసుకుంటా. నన్ను అభిమానించడమే కాదు మీరు ప్రయోజకులైతే అదే నాకు నిజమైన సంతో షం. సాయిరాజేశ్ రెండు నేషనల్ అవార్డ్స్ పొంది నా అభిమానులకు తలమాణికంలా నిలిచాడు.

రవి నంబూరి లాంటి వాళ్లంతా సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినా అసాధారణ కలలు కన్నారు. అదే వీళ్లను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీరు కలలు కనండి, నిజం చేసుకునేందుకు ప్రయత్నించండి విజయం సాధిస్తారు. నేనే అందుకు ఉదాహరణ. కిరణ్ లాంటి కొత్త టాలెంట్ ఇండస్ట్రీకి రావాలి. అప్పుడే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. గౌరి ప్రియ కుందనపు బొమ్మలా ఉంది.. తెలుగుమ్మాయి, తమిళ చిత్రాలతోనూ పేరు తెచ్చుకుంటోంది” అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “చిరంజీవి అనేది ఒక పేరు కాదు ఎమోషన్. ఆయన ఎవరెస్ట్ మీద కూర్చుని మమ్మల్ని ఇన్స్‌పైర్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ ఎస్‌కేఎన్, సాయి రాజేశ్, ధీరజ్‌లకు సినిమా మీద ఉన్న ప్రేమ ఎప్పుడూ మా అందరినీ ముందుకు నడిపిస్తూ ఉండేది. రవి నంబూరి పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆయన రైటింగ్‌కు మీరంతా ఎమోషన్ అవుతారు. స్టీవెన్ శంకర్ రోల్ నాకు వ్యక్తిగతంగా కనెక్ట్ అయింది. నా మాటగా చెబుతున్నా మా సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది” అని చెప్పారు.

హీరోయిన్ శ్రీగౌరిప్రియ మాట్లాడుతూ.. “నా కెరీర్ బిగినింగ్‌లోనే ఇలాంటి మంచి క్యారెక్టర్ దక్కడం సంతోషంగా ఉంది. బరువు బాధ్యత ఆటిట్యూడ్, అహంకారం ఉన్న పాత్రలో నటించా. ఒక డెప్త్ ఉన్న పాత్ర నాది. డైరెక్టర్ రవి నాకు సోదరుడి లాంటివారు. ఒక సోదరిలా ఆయన గెలవాలని కోరుకున్నా. రవి నంబూరి అనే పేరు ఇండస్ట్రీలో వినిపించాలి. కిరణ్ పర్‌ఫార్మెన్స్‌ను కోస్టార్‌గా ఫస్ట్ చూసింది నేనే” అని తెలిపారు. డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ.. “బేబి సినిమాకు వర్క్ చేసేందుకు వెళ్లినప్పుడు సాయిరాజేశ్ ఎవరో నాకు తెలి యదు. కానీ ఆయనతో పనిచేశాక అద్భుతం అనిపించింది. ‘బేబి’ సక్సెస్ తర్వాత ఒకరోజు పిలిచి ‘చెన్నై లవ్ స్టోరీ’కి డైరెక్షన్ చేయమని అవకాశం ఇచ్చారు.

ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. కిరణ్, గౌరి నాకు ఇచ్చిన సపోర్ట్ జీవితాంతం మర్చిపోలేను. సెకండాఫ్‌లో గౌరి చేసిన ఒక సీన్ చూశాక కొన్ని నెలల వరకు మరో హీరోయిన్ గురించి మాట్లాడుకోరు” అన్నారు. సాయిరాజేశ్ మాట్లాడుతూ.. “మా అన్నయ్య మా కోసం వచ్చారు. ఈ రోజు నన్ను హీరోను చేశారు. అన్నయ్య చిరంజీవికి థ్యాంక్స్‌” అన్నారు. ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. “బాస్ అంటే మనం పెంచుకున్న తోట, మనం కట్టుకున్న కోట, మనం ఎంచుకున్న బాట.. అదీ మెగాస్టార్ అంటే.

ఇండస్ట్రీకి రావాలనుకున్న ప్రతి మిడిల్ క్లాస్ వారికి ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవుడే మెగాస్టార్. మా సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు మెగా స్టార్ కదిలి రావడం సంతోషంగా ఉంది. నాకు, సాయి రాజేశ్‌కు ఫైనాన్స్ లెక్కలు తెలియవు. ఒక మంచి సినిమాను వీలైనంత క్వాలిటీగా నిర్మించడమే తెలుసు. ఇది ప్రమోషనల్ ఈవెంట్ కాదు మాకు ఎమోషనల్ ఈవెంట్. రేపు సాయంత్రం అన్ని మెయిన్ సెంటర్లలో ప్రీమియర్స్ వేస్తున్నాం.

ఇదొక ఫీల్ గుడ్ ఎమోషనల్ హానెస్ట్ లవ్ స్టోరీ. బాస్ అభిమానులగా మేము ఎప్పుడూ మంచి ప్రేమ కథల్నే తెరకెక్కిస్తాం” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్, డైరెక్టర్ శివ నిర్వాణతోపాటు ఈ చిత్ర నటీనటులు నరేశ్, మహేందర్, సిరి హన్మంతు, పూజ, నవీన్, డీవోపీ డేనియల్ విశ్వాస్, త్రిగుణ్, లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ కూడా మాట్లాడారు.