నాణ్యమైన విద్య అందించడంలో విద్యా నాయకత్వం కీలకం
డీఈవో సచ్చిదానంద చారి
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 22(విజయక్రాంతి):ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల స్పెషల్ ఆఫీసర్లు, తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి సచ్చిదానంద చారి ప్రారంభించి మాట్లాడారు.పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపులో ప్రధానోపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. నూతన విద్యా విధానం (NEP-2020), ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN), నాణ్యమైన బోధనఅభ్యసన ప్రక్రియ, విద్యార్థుల అభ్యాస ఫలితాల మెరుగుదల, సమగ్ర పాఠశాల నిర్వహణ, విద్యా నాయకత్వం,
ఉపాధ్యాయుల పర్యవేక్షణ, నిరంతర మూల్యాంకనం వంటి అంశాలపై శిక్షణలో సమగ్ర అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రధానోపాధ్యా యులు పరిపాలనా బాధ్యతలతో పాటు విద్యార్థుల అభ్యాస పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉపాధ్యాయులకు సమర్థవంతమైన విద్యా నాయకత్వాన్ని అందించాలని సూచించారు. ప్రతి విద్యార్థి అభ్యాస స్థాయిని గుర్తించి తగిన విద్యా ప్రణాళికలు రూపొందించి పాఠశాలలను ఉత్తమ విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం శ్రీ, డిజిటల్ లెర్నింగ్, సాంకేతికత ఆధారిత బోధన, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక, సమాజ భాగస్వామ్యం, ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బోధన, విద్యార్థుల హాజరు పెంపు, ఫలితాల విశ్లేషణ వంటి అంశాలపై నిపుణుల ద్వారా శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్, కేంద్ర ఇన్చార్జ్ జనార్ధన్, కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి కె. శ్రీనివాస్, రిసోర్స్ పర్సన్లు హనుమంతు, ప్రబోధ్, నటరాజ్, అమరేందర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.






