03-12-2025 12:04:51 AM
పవన్ సినిమాలు రిలీజ్ కానివ్వం
-ద్వేషపూరితంగా మాట్లాడటం సరికాదు
-చిరంజీవి సూపర్ మ్యాన్.. ఆయన ఎప్పుడూ వివాదాలకు దూరం
-సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి) : కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలినట్టు ఉంది అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదమూడేళ్లు కావస్తున్నా, ఇంకా ద్వేషపూరితంగా మాట్లాడటం సరికాదని మంత్రి సూచించారు. మంగళవారం ఆయన గాంధీభవన్ ఆవరణ లో మీడియాతో మాట్లాడుతూ.. తను చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలకు పవన్ బేషరతుగా క్షమాపణలు చెప్పా లని డిమాండ్ చేశారు.
పవన్ క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలను ఆడనివ్వమని హెచ్చరించారు. చిరంజీవి సూపర్ మ్యాన్ అని, ఆయన ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటారని అన్నారు. కానీ పవన్ కల్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి డిప్యూటీ సీఎం అవ్వగానే తెలిసీ తెలియక మాట్లాడారో.. కావాలనే మాట్లాడారో కానీ, క్షమాపణ చెప్పాలన్నారు.
అలాచేస్తేనే కనీసం ఆయన సినిమా ఒకటి, రెండు రోజులు అయినా థియేటర్లో ఆడతుందని, లేదంటే ఆయన సినిమాలు తెలంగాణలో విడుదల కానివ్వమని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఈ విషయం చెబుతున్నానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాము ఎంతో నష్టపోయామని, హైదరాబాద్ ఆదాయాన్ని విశాఖపట్నం, కాకినాడ, తిరుపతికే వాడుకున్నారని వివరించారు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వల్ల నష్టపోయామని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు.
మా రేషాన్ని గిచ్చొద్దు
యాక్టర్‌వా.. డిప్యూటీ సీఎంవా?
-ఆంధ్రాలో తుఫానొచ్చి మా ఊర్లు మునుగుతుంటే మేమేమన్న అంటున్నమా?
-అక్కడ కొబ్బరిచెట్లెండిపోతే మేమెట్ల కారణమైతం?
-మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపాటు
హుస్నాబాద్, డిసెంబర్ 2 : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యా ణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయమని, ఆయన తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే, తెలంగాణ ప్రజల ‘దిష్టి’ తగిలిందని పవన్ వ్యాఖ్యానించడం ఏమిటని మంత్రి మండిపడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగాలని, తెలంగాణ రేషాన్ని గిచ్చొద్దన్నారు.
మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల భావంతో ఉండే రాష్ట్రాలు. కానీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కల్యాణ్ వివేకవంతుడా లేక అవివేకవంతుడా?. నువ్వు యాక్ట ర్‌వా, డిప్యూటీ సీఎంవా?’ అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో తుపాన్లు వస్తే తెలంగాణలో ఊర్లు మునిగిపోతున్నప్పుడు తాము దానిని ప్రకృతి వైపరీత్యంగానే భావించాం తప్ప, ఆంధ్రప్రదేశ్‌ను తప్పుపట్టలేదన్నారు.
అక్కడెక్కడో కొబ్బరి చెట్లు ఎండిపోతే, తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందని నిందించడం తెలంగాణ ప్రజలకు కించపరచడమే అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు పెంచుతాయన్నారు. మిత్రపక్షంగా ఉన్న తెలంగాణ బీజేపీ నాయకత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించాలని మంత్రి డిమాండ్ చేశారు.