చైతూలో ఆ లక్షణాలే నచ్చాయ్
శోభిత ధూళిపాళ్ల వివాహం ఇటీవల అక్కినేని నాగచైతన్యతో జరిగిన విషయం తెలిసిందే. ఈ మధుర ఘట్టానికి సంబంధించిన ఫొటోలను శోభిత సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత అభిరుచులను, భక్త నాగచైతన్య గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారామె. ‘నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో నాకు ఎన్నో తిరస్కరణలు ఎదురయ్యాయి. అందంగా లేనని, ఆకర్షణీయంగా కనిపించనని నా ముఖం మీదే చెప్పేవారు. ఓ ప్రముఖ కంపెనీ వాణిజ్య ప్రకటనల్లో నటించేందుకు ఆడిషన్స్‌కు వెళితే బ్యాక్‌గ్రౌండ్ మోడల్‌గా కూడా పనికిరానని చెప్పడం నన్ను ఎంతో బాధించింది.
తర్వాత పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించి కొన్నాళ్లకు అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాను. నాకేదైనా పాత్ర నచ్చితేనే సినిమా ఒప్పుకొంటాను.. అంతేకానీ ఎప్పుడూ తెరపై కనిపించాలనే కోరిక నాకు లేదు. చైతూలోని సింప్లిసిటీ, మంచి మనసు, దయ, ఇతరుల పట్ల మర్యాదగా ఉంటూ హందాగా ప్రవర్తించే లక్షణాలే నన్ను ఆకట్టుకున్నాయి. ఎంతో కాలంగా ఎదురుచూసిన ప్రేమ చైతూ రూపంలో నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా’ అని తెలిపారు శోభిత.






