23 May, 2026 | 1:13 AM

టైటిల్ నేనే లీక్ చేస్తానేమో!

23-05-2026 12:00 AM

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబోలో రూపొందుతున్న సినిమా ‘చిరు-బాబీ2’, ‘చిరు158’ అనే వర్కింగ్ టైటిల్స్‌తో ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రా న్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. పలు భాషల్లో భారీ విజయాలు అందుకున్న ఈ బ్యానర్‌పై తెలుగులో రూపొందుతున్న తొలిచిత్రం కావడం విశేషం. నిర్మాత వెంకట్ కే నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గురువారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించినట్టుగానే మేకర్స్ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభించారు. తొలి షెడ్యూల్‌లో చిరంజీవి, అనస్వర రాజన్‌లపై కీలక టాకీ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నారు. కథలో ఈ సన్నివేశాలు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా చిత్రబృందం బీటీఎస్ వీడియోను విడుదల చేసింది. ఇందులో సినిమా ప్రధాన సాంకేతిక బృందాన్ని పరిచయం చేశారు.

వీడియోలో చిరు.. లెట్స్ సెట్ ది బ్లడీ బెంచ్‌మార్క్ అంటూ సందడి చేశారు. అనంతరం దర్శకుడు బాబీని సినిమా టైటిల్ గురించి అడగ్గా, ఆయన దాటవేయడానికి ప్రయత్నించారు. దానికి చిరంజీవి సరదాగా స్పందిస్తూ, సరైన సమయంలో నేనే టైటిల్ లీక్ చేస్తానేమో అంటూ చమత్కరించారు.

కోన వెంకట్, కే చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ సినిమాకు హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి అదనపు స్క్రీన్‌ప్లే రచయితలుగా పనిచేస్తున్నారు. భానునందు ద్వయం సంభాషణలను అందిస్తున్నారు. చిత్రానికి సంగీతం: తమన్; సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తిక్ కన్నన్; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా; ఎడిటింగ్: ఆంటోని ఎల్ రూబెన్.