23 May, 2026 | 12:58 AM

పురుషః కపుల్స్ బయోపిక్!

23-05-2026 12:00 AM

సినిమా సమీక్ష :

పవన్ కళ్యాణ్ బత్తుల, సప్తగిరి, కసిరెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘పురుషః’. వీరు వులవల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బత్తుల కోటేశ్వరరావు నిర్మించారు. రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ఇందులో హీరోయిన్లు. ఈ సినిమా శుక్రవారం (మే 22)న విడుదలైంది. కామెడీ, ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.. 

కథ ఏంటంటే..? 

చిన్నప్పట్నుంచి గోవింద్ (పవన్ కళ్యాణ్), సత్తిబాబు (సప్తగిరి), శ్రీను (కసిరెడ్డి రాజ్‌కుమార్), కిస్ (వెన్నెల కిశోర్) మంచి స్నేహి తులు. అన్నీ షేర్ చేసుకుంటారు. వీరికి పెళ్లిళ్లు అవుతాయి. గోవింద్‌ను.. కమల (రాయంచ) ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. సత్తిబాబుకు లక్ష్మి (హసిని) తో, శ్రీనుకు గీత (విషిక)తో మ్యారేజ్ అవుతుంది. వీరి మ్యారేజ్ లైఫ్ సాఫీగా సాగదు. గొడవలు అవుతుంటాయి. దీంతో తమకు విడాకులు కావాలని వీరి భార్యలే కోర్టుకె క్కుతారు. ఈ కేసు విషయమై భర్తలు తిరుగుతుంటారు కోర్టు చుట్టూ కానీ, భార్యలు రారు.

కేసులు వాయిదా పడతాయి. వీరి బాధను అర్థం చేసుకున్న జడ్జి (వీటీవీ గణేశ్) సమస్య ఏంటో తెలుసుకుంటాడు. ఇందులో గోవింద్, కమల ప్రేమకథ ఆసక్తికరంగా ఉంటుంది. మరి గోవింద్, కమల ప్రేమకథ ఎలా ప్రారంభమైంది? ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? గోవింద్ గతం ఏంటి? సత్తిబాబు, శ్రీనులపై వారి భార్యలకు ఎక్కడ అనుమానం కలిగింది? వీళ్ల కొంపముంచడంలో కిస్ పాత్రేం టి? చివరికి ఈ కథ ఎలా ముగిసిందనేదే సినిమా. 

సినిమా ఎలా ఉందంటే..?

విడాకుల చుట్టూ తిరిగే ఫ్యామిలీ డ్రామానే ‘పురుషః’ భార్యాభర్తల జీవితాలను ఆవిష్కరించే చిత్రమిది. ఇలాంటి చిత్రాలు రావడం చాలా అరుదు. వినోదం వర్కౌట్ అయితే, డ్రామా పండితే సినిమా విజయం సాధించినట్టే. దర్శకుడు వీరూ ఆ దృష్టికోణంలోనే ఈ సినిమాను నడించాడు. కామెడీ ప్రధానంగా చేసుకుని, ఆద్యంతం నాటకీయంగా మలిచాడు. భార్యాభర్తల మధ్య జరిగే గొడవలను హాస్యభరితంగా చూపించాడు.

సినిమా చూస్తుంటే, ప్రతి ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచూ జరిగే విషయాలే గుర్తుకొస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే ఇదొక కపుల్స్ బయోపిక్! క్లైమాక్స్ కట్టిపడేస్తుంది. భావోద్వేగభరితంగా ఉంటుంది. ప్రేమే అన్నింటికి పరిష్కారం అని చెప్పిన తీరు సగటు ప్రేక్షకుడిని మెప్పించేలా ఉంది.  

తారాగణం.. సాంకేతిక సిబ్బంది పనితీరు.. 

గోవింద్ పాత్రలో కొత్త కుర్రోడు పవన్ కళ్యాణ్.. హీరోగా సినిమాను తన భుజాలపై నడిపించాడు. నటన పరంగా బాగా చేశాడు. సత్తిబాబు పాత్రలో సప్తగిరి తనదైన శైలిలో నవ్వించాడు. కసిరెడ్డి జంపింగ్ పదాలతో నవ్వులు పూయించాడు. కమలగా రాయంచ లుక్ పరంగా, నటన పరంగా బాగుంది. యాక్టింగ్ ఫర్వాలేదనిపించింది. విషిక కామెడీ బాగుంది. హసిని కూడా మెప్పించింది. వెన్నెల కిశోర్ కనిపించేది కాసేపే అయినా కడుపుబ్బా నవ్వించాడు.

లాయర్‌గా అనంత శ్రీరామ్ నవ్వించే ప్రయత్నం చేశారు. జడ్జిగా వీటీవీ గణేశ్, మిగతా పాత్రలూ ఓకే అనిపిస్తుంది. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం ఫర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సతీశ్ ముత్యాల కెమెరా వర్క్.. విజువల్‌గా సినిమా పెద్ద రేంజ్‌లో ఉంది. నిర్మాతగా బత్తుల కోటేశ్వరరావు ప్యాషన్ ప్రతి ఫ్రేములోనూ కనిపించింది.

దర్శకుడు వీరూ ఎంచుకున్న కథ బాగుంది. సంభాషణలు ఆకట్టుకునేలా, ఆలోచింపజేసేలా ఉన్నాయి. ప్రస్తుత సమా జంలోని భార్యాభర్తల సంబంధాలను కళ్లకు కట్టినట్టు చూపించారు.  సరదాగా కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా ‘పురుషః’. భార్యాభర్తలకు సంబంధించి ఇచ్చిన సందేశం బాగుంది. రేటింగ్: 3/5.