మా కొడుకు ఎట్ల సచ్చిపోయిండో చెప్పాలె
-పోలీసులు విచారణచేయకముందే ప్రమాదవశాత్తు మరణమని మంత్రి ఎట్లా అంటరు
-మాకు న్యాయం కావాలె గురుకులంలో మృతిచెందిన విద్యార్థి తల్లిదండ్రులు, బంధువుల డిమాండ్
-మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా రాస్తారోకో
హుస్నాబాద్, సెప్టెంబర్ 16 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థి సనాదుల వివేక్ (13) అనుమానాస్పద మృతిపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను విజయక్రాంతి స్పష్టంగా ప్రచురించింది. దాంతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు భగ్గుమన్నారు. వివేక్ మరణం ప్రమాదవశాత్తు జరిగిందని దర్యాప్తు కొనసాగుతుండగానే మంత్రి తేల్చి చెప్పడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
గురువారం మృతుడి తల్లిదండ్రులు లావణ్య, సత్యనారాయణ, బంధువులు, దళిత సంఘాల ప్రతినిధులు మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో వివేక్ ఫొటో పట్టుకొని బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ‘పోలీసులు విచారణ చేయకముందే, పోస్టుమార్టం నివేదిక రాకముందే మా కొడుకు మరణం ప్రమాదవశాత్తూ జరిగిందని మంత్రి ఎట్లా అంటారు?‘ అని వివేక్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల విచారణ కొనసాగుతుండగానే మంత్రి ఇలా వ్యాఖ్యానించడంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. తమ కొడుకు ఎలా చనిపోయాడో తేల్చి, తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు.
మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వెంటనే ఆందోళన స్థలానికి వచ్చి తమకు న్యాయం చేయాలని పట్టుబట్టారు. మంత్రి వ్యాఖ్యలు దర్యాప్తు దిశను పరోక్షంగా ప్రభావితం చేయడమేనని, తద్వారా నిజాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆందోళనకారులు ఆరోపించారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, పోలీసు విచారణ పూర్తికాకముందే మంత్రి ఒక నిర్ధారణకు రావడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గురుకులంలో విద్యార్థి భద్రతపై ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా ఉన్నప్పటికీ, మంత్రి వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
న్యాయం కోసం నిరాహార దీక్ష..
హత్యా? ఆత్మహత్యా? ప్రమాదవశాత్తూ? అనే మిస్టరీ తేలేదాకా, వివేక్ కుటుంబానికి న్యాయం జరిగేలా నిష్పక్షపాతమైన దర్యాప్తు కొనసాగాల్సిన అవసరం ఉందని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చి, తమ కొడుకు మరణానికి గల అసలు కారణాన్ని నిర్ధారించడానికి పోస్టుమార్టం నివేదిక, సంఘటన జరిగిన ప్రదేశంలోని ఆధారాలను బహిర్గతం చేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు. న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే నిరాహార దీక్షకు సైతం సిద్ధంగా ఉన్నామని వారు హెచ్చరించారు.




