బకాయిలు తీర్చేదాకా నిద్రపోను
చేనేత పరిశ్రమకు అండగా ఉంటాం
కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్‌రావు హామీ
రాజన్న సిరిసిల్ల, మే 9 (విజయక్రాంతి): సిరిసిల్ల చేనేత పరిశ్రమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు తీర్చే వరకు నిద్రపోనని కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు స్పష్టంచేశారు. సిరిసిల్లలో గురువారం పవర్‌లూమ్ వస్త్ర పరి శ్రమ అనుబంధ సంఘాల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజేందర్‌రావు మాట్లాడుతూ.. సిరిసిల్ల ప్రాం తం చేనేత కార్మికుల మణిహారమని, అలాంటి రంగాన్ని గత బీఆర్‌ఎస్, బీజేపీ పాలకులు విస్మరించి కష్టాల ఊబిలోకి నెట్టేసారని ఆరోపించారు. చేనేత సమస్యలపై స్థానిక నాయ కులతో కలిసి పలుమార్లు సీఎంను కలిశామని చెప్పారు. అందులో భాగంగానే రూ.50 కోట్ల నిధులు విడుదలయ్యాయని స్పష్టంచేశారు.
ఎన్నికల కోడ్ ఎత్తేయగానే బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని చెప్పారు. వారణాసి టెక్స్‌టైల్‌కు ప్రధాని మోదీ యేటా రూ.వెయ్యి కోట్లు ఇస్తుంటే.. ఇక్కడ బండి సంజయ్ నేతన్నల ఆకలి కేకలకు కారణమవుతున్నాడని విమర్శించారు. నిరంతరం చేనేత, వ్యవసాయ కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తనను గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.






