ఈ నెల 15 వరకు వర్షాలే
నేటి నుంచి ఆరు రోజుల పాటు వానలు
హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. నేటి నుంచి ఈ నెల 15 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదరుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 11న ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, జనగాం జిల్లాల్లో.. 12న కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఇక, 13న సిద్దిపేట, యాద్రాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.14,15 తేదీల్లో కూడా పలు జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందని, అందువల్ల గరిష్ఠంగా 37 డిగ్రీలు, కనిష్ఠంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కాగా, గురువారం నిజామాబాద్ జుకోరాలో 42.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా అత్యల్పంగా వికారాబాద్ జిల్లాలోని ఉమ్మెతల్‌లో 19.7 డిగ్రీలు రికార్డయింది. గ్రేటర్ హైదరాబాద్‌లో రాజేంద్రనగర్ సర్కిల్ 11లో 40.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యల్పంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం శేరిలింగంపల్లి సర్కిల్ 20లో 25.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
హైదరాబాద్‌లో పలు చోట్ల స్వల్ప వర్షం..
హైదరాబాద్‌లో గురువారం పలు చోట్ల కొద్దిపాటి వర్షం కురిసింది. బహదూర్‌పుర మండలంలో 10.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాజేంద్రనగర్‌లోని సులేమానన్‌నగర్‌లో 11.5 మి.మీ, ఫలక్‌నుమాలోని చందూలాల్ బరాదరిలో 10.3 మి.మీ, చాంద్రాయణగుట్ట లోని ఏక్తా కాలనీలో 5.0 మి.మీ, జియాగూడలో 2.8 మి.మీ, జుమేరాత్ బజార్‌లో 1.5 మి.మీ, గోషామహల్‌లో 1.0 మి.మీ, సంతోష్‌నగర్‌లో రెయిన్‌బజార్‌లో 1.0 మి.మీ, మలక్‌పేట్‌లో 1.0 మి.మీ, మెహదీపట్నంలోని ఆసిఫ్‌నగర్‌లో 0.8 మి.మీ వర్షపాతం నమోదైంది. మరో రెండు మూడు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉండటంతో విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని మునిసిపల్ అధికారులు సూచించారు.






