7 March, 2026 | 9:19 AM

బడుగులకు అండగా ఉంటా

07-03-2026 01:40 AM

వెనకనుంచి జరిగే దాడుల విషయంలో మీ జాతి నాకు అండగా ఉండాలి

నా మాదిగలకు అండగా ఉండటమే నా మిత్రధర్మం..

గత ప్రభుత్వం గొర్రెలు, బర్రెలు ఇచ్చి చేతులు దులుపుకున్నది

నాణ్యమైన విద్యతోనే దారిద్య్రరేఖ దిగువనఉన్న జాతుల తలరాత మారుతుంది

పేదలకు సంక్షేమ ఫలాలు అందాలంటే ప్రభుత్వ ఉద్యోగులే బ్రాండ్ అంబాసిడర్లు కావాలి

ఎస్సీ వర్గీకరణ ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి

వడ్డించేవాళ్లు మనవాళ్లైతే కాదు.. ఆ జాతి కలెక్టర్లు, ఇంజనీర్లు కావాలి 

శిల్పకళా వేదికలో ఎస్సీ వర్గీకరణ ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్,సిటీ బ్యూరో మార్చి 6 (విజయక్రాంతి):  నాకు మహాభారతంలో కర్ణుడు, బర్బరీ కుడు ఘటోత్కచుని కుమారుడు పాత్రలంటే చా లా ఇష్టం. కర్ణుడు మిత్రధర్మాన్ని నెరవేర్చితే.. బర్బరీకుడు బలహీనుల పక్షాన నిలబడి పోరాడాడు. నేను కూడా ఇప్పుడు అదే మిత్రధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. మీరు బలహీనులు కాబట్టే ఎంత రాజ కీయ ఒత్తిడి వచ్చినా మాదిగల పక్షాన అండగా నిలబడ్డాను అని ముఖ్యమంత్రి ఎనుముల రేవం త్ రెడ్డి అన్నారు.

ఈ ప్రభుత్వం ప్రజలందరిదీ అని, ప్రజల జీవితాల్లో మార్పు రావాలన్న బలమైన ఆకాంక్షతోనే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ముందుండి సమస్యలను పరిష్కరిస్తున్నప్పుడు, వెనుక నుంచి జరిగే రాజకీయ దాడులను ఆపాల్సిన బాధ్యత ఆయా వర్గాల దేనని సీఎం స్పష్టం చేశారు. వెనక నుంచి జరిగే దాడుల విషయంలో మీ జాతి నాకు అండగా ఉండాలి.

నిరంతరం అప్రమత్తంగా ఉండి సమస్యలను అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలి. ప్రమోషన్లు, ఉన్నత విద్య, లిడ్‌క్యాప్ భూములను కాపాడుకోవడం వంటి సమస్యలను పరిష్కరించడం పెద్ద విషయం కాదు. మీ హక్కులను చట్టబద్ధం చేసి కాపాడుతాం అని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో శుక్రవారం జరిగిన ఎస్సీ వర్గీకరణ ఉద్యోగ సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల తీరును ఎండగడుతూనే, ఎస్సీ వర్గీకరణ సాధనలో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ వద్ద ఎలాంటి అధికార యంత్రాంగం, అక్రమ సంపాదన లేదని సీఎం రేవంత్ గుర్తుచేశారు. ఒకవైపు అక్రమ కేసులు, అక్రమ సంపాదనతో ఆధిపత్యం చెలాయిస్తున్న వారుంటే.. మరోవైపు ప్రజల పక్షాన చిత్తశుద్ధితో మేం చేసిన పోరాటం గెలిచింది. కేవలం మాటలు, మూటలతో అయితే మేం ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదు. ప్రజల ఆశీర్వాదంతోనే ఈ విజయం సాధ్యమైంది అని ఆయన పేర్కొన్నారు.

20 ఏళ్లుగా మాదిగల పోరాటాన్ని చూస్తున్నా..

ఎస్సీ వర్గీకరణ కోసం దశాబ్దాలుగా సాగుతున్న పోరాటం తనకు తెలుసని, 20 ఏళ్లుగా ఈ సమస్యను ప్రత్యక్షంగా చూస్తూ వచ్చానని ముఖ్యమంత్రి చెప్పారు. వర్గీకరణ సాధనలో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. ఎన్నో కమిషన్లు వచ్చాయి, చిక్కుముడులు ఎదురయ్యాయి. మీరు కొట్లాడిన ప్రతి సందర్భంలోనూ నా చేతనైన సాయం చేస్తూ వచ్చాను. కష్ణ మాదిగ, సతీష్ మాదిగ నా వద్దకు వచ్చినప్పుడు అండగా నిలిచాను.

అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టినప్పుడు నాటి పాలకులు సండ్ర వెంకటవీరయ్య, సంపత్ కుమార్‌తో పాటు నన్ను బయటకు గెంటివేశారు” అని నాటి చేదు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే దేశంలో వర్గీకరణను అమలు చేసిన మొదటి రాష్ర్టం తెలంగాణే అని, తన మం త్రివర్గ సహచరులు, అధికారులు సమయస్ఫూర్తితో తనకు అండగా నిలిచారని ప్రశంసించారు.

 విద్యతోనే జీవితాల్లో మార్పు 

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం బ డుగులకు బర్రెలు, గొర్రెలు, చేపలు ఇచ్చి చెప్పులు కుట్టుకోమని చెప్పింది. కానీ మనకు కావాల్సింది అవి కాదు. చెప్పులు కుట్టుకున్న జాతే ఈ రాజ్యాన్ని నడపాలి. మీలోంచి కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు రావాలి. అప్పుడే తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు పూర్తిస్థాయిలో భాగస్వాములు అవుతారు” అని పిలుపు నిచ్చారు.

దారిద్య్రరేఖ దిగువన ఉన్న జాతులు ముందుకు నడవాలంటే నాణ్యమైన విద్య అత్యవసరమని సీఎం స్పష్టం చేశారు. “నా వద్ద ఉన్న విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నాను. ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు కాస్మెటిక్, డైట్ ఛార్జీలను పెంచాం. విద్య ఒక్కటే మీ జీవితాల్లో శాశ్వత మార్పును తీసుకువస్తుంది” అని అన్నారు

ప్రభుత్వ ఉద్యోగులే నా బ్రాండ్ అంబాసిడర్లు.. 

పేదలకు సంక్షేమ పథకాలు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలకపాత్ర అని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు, బ్రాండ్ అంబాసిడర్లు నా ప్రభుత్వ ఉద్యోగులే. మనం 99 రోజుల ‘ప్రజా పాలన  ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి పేదవాడికి రేషన్ కార్డు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్ల్లు, ఉచిత విద్యుత్ అందాలంటే మీరు మరింత కష్టపడి పనిచేయాలి.

అత్యంత వెనుకబాటు తనంలో ఉన్న మాదిగ జాతికి ప్రభుత్వ ఉద్యోగులు అండగా ఉండాలి” అని దిశానిర్దేశం చేశారు. తాను సీఎం పదవిని పది మందికి సాయం చేసే అవకాశంగా మాత్రమే భావిస్తున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. నేను ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు ‘రేవంత్ మాదిగ’ అన్నారు, వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తే ‘రేవంత్ ముదిరాజ్’, బీసీలకు మేలు చేస్తే ‘రేవంత్ యాదవ్’, సిక్కుల కోసం ‘సర్దార్ రేవంత్’, అసదుద్దీన్‌కు సాయం చేస్తే ‘రేవంతుద్దీన్’ అని రకరకాలుగా పిలిచారు. నన్ను ఎలా పిలిచినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.

నేను అందరివాడిని. నా జాతికి చేయూత ఇచ్చినప్పుడే నాకు నిజమైన సంతోషం కలుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీరాకుమార్ గారు ఎలా పనిచేశారో, నేను కూడా అదే స్ఫూర్తితో బడుగుల కోసం పనిచేస్తా” అని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.ఈ ధన్యవాద సభలో మంత్రులు దామోదర రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితర ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో మాదిగ సామాజికవర్గ ఉద్యోగులు పాల్గొన్నారు.