27 May, 2026 | 2:24 AM

కెమెరాతో కథ చెప్పాలని ప్రయత్నిస్తా!

27-05-2026 01:40 AM

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డీవోపీ రత్నవేలు విలేకరులథక్ష సినిమా విశేషాలు పంచుకున్నారు.

* ‘పెద్ది’ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్. 40 ఏళ్ల క్రితం విజయనగరంలో జరిగే కథ. ఇప్పుడు విజయనగరం పూర్తిగా మోడ్రన్ అయిపోయింది. కానీ, ఒకప్పటి విజయ నగరానికి ప్రేక్షకులను తీసుకెళ్లాలి. రిఫరెన్స్ కోసం కొన్ని ఫొటోలు తీసుకుని, కథను విజువల్‌గా అందంగా రూపొందించడం కోసం చాలా పకడ్బందీగా పనిచేశాం.  

* ‘పెద్ది’లో నాకు అత్యంత కాంప్లికేటెడ్‌గా అనిపించింది క్రికెట్ మ్యాచ్. ఇది స్పోర్ట్స్ బేస్డ్ సినిమా కాబట్టి కెమెరామెన్‌తోపాటు మొత్తం టీమ్ చాలా అవగాహనతో ఉండాలి. సినిమాలో వచ్చే సెకండ్     క్రికెట్ మ్యాచ్ చాలా కీలకం. అది కేవలం మ్యాచ్ కాదు, కథలోనే ఒక పెద్ద మలుపు. రెండు జట్ల మధ్య యుద్ధంలా అనిపిస్తుంది. ఆ మ్యాచ్‌ను రాత్రిపూట షూట్ చేద్దామని నేను బుచ్చిబాబుకు           సూచించా. 80ల్లో ఫ్లడ్‌లైట్ మ్యాచ్‌లు జరిగేవి. ఆ మూడ్ కోసం నైట్ షూట్ అయితే బాగుంటుందనిపించింది. అద్భుతమైన ఆలోచన, సినిమా మరో స్థాయికి వెళ్లిందని చరణ్ చెప్పడం నాకు             ఆనందాన్నిచ్చింది. 

* సినిమాలో హనుమంతుడి రిఫరెన్స్‌తో వచ్చే ఒక సీక్వెన్స్ ఉంది. ఆ సీక్వెన్స్‌లో ప్రత్యేక లైటింగ్ డిజైన్ చేశా. అది థియేటర్లో చూసినప్పుడు గూస్‌బంప్స్ వస్తాయి. చరణ్‌లో ఒక హనుమంతుడిని చూస్తారు.  

* క్లైమాక్స్ కూడా చాలా చాలెంజింగ్. అది ప్రేక్షకులకు కన్నుల పండువలా ఉంటుంది. చివరి 30 నిమిషాలు సినిమా ప్రేక్షకులను కదిలిస్తుంది. 

* ఢిల్లీలో చిత్రీకరించిన పోర్షన్ నాకు చాలా ఫేవరెట్. అక్కడ లైట్ లేకుండా షూట్ చేశా. దానికోసం దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఫిల్మ్ నెగటివ్‌ను ఉపయోగించా. ఒక రియల్ ఫీల్ కోసం, ఈ జర్నీలో ఉన్న రియలిజం చూపించడానికి ఫిల్మ్ నెగటివ్ ఉపయోగించాం. 

* శ్రీలంకలో షూటింగ్ కూడా స్పెషల్ ఎక్స్‌పీరియన్స్. అక్కడో వాటర్ ఫాల్ సీక్వెన్స్ ఉంది. అక్కడ ఇంతకు ముందు ఎవరూ షూట్ చేయలేదు. అది ఒక రైల్వేట్రాక్ దగ్గర ఉంటుంది. ఆ ట్రాక్ మమ్మల్ని చాలా ఎగ్జైట్ చేసింది. మేము చాలా కష్టపడి ఆ ప్రదేశానికి వెళ్లాం. 

* ఇలాంటి పెద్ద సినిమాలు ఐమాక్స్‌లో అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. ఆ ఐమాక్స్ స్క్రీన్లలో ప్రేక్షకులు పొందే అనుభూతి కోసమే నేను కష్టపడుతుంటా. నా కెమెరాతో ఒక కథ చెప్పాలని ప్రయత్నిస్తా. రీ-రికార్డింగ్‌కు కూడా కథలో స్పేస్ ఉండాలి. ఒక డీవోపీకి మ్యూజిక్ సెన్స్, ఎడిటింగ్ సెన్స్ ఉంటే, దర్శకుడికి చాలా ఉపయోగపడుతుంద. బుచ్చిబాబు నాకు ఈ సినిమా కోసం చాలా స్వేచ్ఛనిచ్చారు. 

* ‘పెద్ది’లో ఒక కుస్తీ ఫైట్‌లోని ఒక పోర్షన్‌ను మా అబ్బాయి షూట్ చేశాడు. తనకు కలర్ గ్రేడింగ్ నాలెడ్జ్ చాలా ఎక్కువ. ఇప్పుడు డీవోపీగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను దర్శకుడిగా మారాలన్న ఆలోచన ఉంది. ఇప్పటికే మూడు కథలు రాశా. మంచి ఎమోషన్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ చేయాలనుకుంటున్నా.