లవ్ స్టోరీకి సంగీతమే ప్రాణం
కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటిస్తున్న కొత్త సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ’. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ సింగిల్ ‘వదలనే..’ పాటను సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్ లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి చేతుల మీదుగా లాంఛ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్లు మాధవపెద్ది సురేశ్, కల్యాణి మాలిక్, అనూప్ రూబెన్స్, హరి గౌర, మార్క్ కే రాబిన్, సింజిత్ యెర్రమల్లి, చేతన్ భరద్వాజ్, స్వీకర్ అగస్తీ, సురేశ్ బొబ్బిలి, వివేక్ సాగర్, శ్రీచరణ్ పాకాల తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ.. “చెన్నై లవ్ స్టోరీ’ కూడా బేబి సినిమా స్టాండర్డ్‌లోనే ఉంటుందని అర్థమవుతోంది. ‘వదలనే..’ పాటను మ్యూజిక్ లవర్స్, మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ వదలనే అనాలి. అంత పెద్ద విజయం సాధించాలి.
ఒక లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే సినిమా బ్లాక్‌బస్టర్ అనుకోవచ్చు. ఎందుకంటే లవ్ స్టోరీకి ప్రాణమే సంగీతం” అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “ఈ సినిమా ఎలాంటి విజయం అందించబోతుందో మాకు తెలుసు. ‘వదలనే’ పాట పిక్చరైజేషన్ పాండిచ్చేరిలో చేశాం. ఒక టెంపుల్ దగ్గర డైరెక్టర్ రవి నాకు, గౌరికి సీన్ చెబుతున్నప్పుడు మా ముగ్గురికీ కళ్లు చెమర్చాయి. అంత భావోద్వేగానికి గురయ్యాం. ఆ సీన్ విజువల్ తెలుగు సినిమాల్లో ఒక ఐకానిక్‌గా మిగిలిపోతుంది” అని చెప్పారు.
హీరోయిన్ శ్రీగౌరి ప్రియ మాట్లాడుతూ.. “నేను సింగర్ కావాలని ప్రయత్నించా. ఏ కాంపిటేషన్‌కు వెళ్లినా మణిశర్మ పాటలు పాడా. అలా ఆయన నన్ను కొత్త సింగర్‌గా ఇన్స్‌పైర్ చేశారు. ఇప్పుడాయన మ్యూజిక్ చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటించడం గౌరవంగా భావిస్తున్నా. ఒక మ్యూజిక్ లవర్‌గా ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్లతో వేదిక షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ‘వదలనే’ పాట ఇప్పట్లో మిమ్మల్ని వదలదు” అని తెలిపింది. ‘వదలనే పాట నా కెరీర్‌లో బెస్ట్ సాంగ్‌గా మిగిలిపోతుంద’ని డైరెక్టర్ రవి నంబూరి చెప్పారు.
నిర్మాత సాయిరాజేశ్ మాట్లాడుతూ.. “ఇలాంటి పాట తీసుకోవడానికి డైరెక్టర్‌కు గట్స్ ఉండాలి. ‘వదలనే’ పాట చిరకాలం మనసులో నిలిచిపోతుంది. సినిమా రిలీజ్ అయ్యాక ఒక గొప్ప పాటగా నిలిచిపోతుంది. ఈ సినిమా అందరి మనసులు గెలవాలని కోరుకుంటున్నా” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అతిథులతోపాటు కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని, డీవోపీ డేనియల్ విశ్వాస్, చిత్రబృందం కూడా మాట్లాడారు.






