18 April, 2026 | 1:32 AM

అప్రూవర్‌గా మారతా: జాక్వెలిన్

18-04-2026 12:00 AM
  1. పాటియాలా కోర్టుకు అభ్యర్థన
  2. సుకేశ్ రూ. 215 కోట్ల మనీలాండరింగ్ కేసులో మలుపు
  3. ఈడీని సంప్రదించాలన్న కోర్టు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 215 కోట్ల మనీలాండరింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాం డెజ్ అప్రూవర్‌గా మారేందుకు సిద్ధమయ్యా రు. ఇందుకు అనుమతివ్వాలంటూ పాటియాలా హౌస్ కోర్టులో శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా చెప్పారు. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకారం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని నటి శుక్రవారం కోర్టును అభ్యర్థించారు.

ఇందుకోసం ముందుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరే ట్ (ఈడీ)ను సంప్రదించాలని నటికి న్యాయస్థానం సూచించింది. నిబంధనల ప్రకారం ఇలాంటి కేసుల్లో అప్రూవర్‌గా మారాలంటే ముందుగా దర్యాప్తు సంస్థను అభ్యర్థించాల్సి ఉంటుంది. ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన అనంతరం సాక్షిగా మారేందుకు కోర్టులో దరఖాస్తు చేయాలా, వద్దా అనేదాన్ని దర్యాప్తు సంస్థ నిర్ణయిస్తుంది. మాజీ రాన్‌బాక్సీ ప్రమోటర్ శివిందర్ సింగ్ భార్య అయిన అదితి సింగ్‌ను సుమారు రూ. 200 కోట్లు మోసం చేశాడనే ఆరోపణలు సుకేశ్‌పై ఉన్నాయి.

దోపిడీ చేసిన డబ్బు నుంచి నటి లబ్ధి పొందినట్లు దర్యాప్తులో తేలింది. సుకేశ్ నుంచి రూ. 10 కోట్ల విలువైన కానుకలను జాక్వెలిన్, ఆమె కుటుంబసభ్యులు అందుకున్నట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. అందు లో ఖరీదైన ఆభరణాలు, నాలుగు పర్షియన్ పిల్లులు, రూ. 57 లక్షల విలువైన గుర్రం, బ హ్రెయిన్‌లో నివసిస్తున్న జాక్వెలిన్ తల్లిదండ్రులకు రూ. 1.89 కోట్ల రెండు విలువైన కా ర్లు, జాక్వెలిన్ సోదరుడికి ఎస్‌యూవీ కారు, సోదరికి రూ. 1.25 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారు ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది.