హోర్ముజ్‌ను పూర్తిగా తెరిచిన ఇరాన్
- ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య సీజ్‌ఫైర్ ఒప్పంద ఫలితం
- మా పర్యవేక్షణలోనే నౌకల రాకపోకలు: ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ
- ఇరాన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
టెహ్రాన్, ఏప్రిల్ ౧౭: ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన విడుదల చేసింది. హోర్ముజ్ జలసంధిని అన్ని రకాల వాణిజ్య నౌకల రాకపోకల కోసం పూర్తిగా తెరిచినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శుక్రవారం మాట్లాడుతూ.. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం (సీజ్‌ఫైర్) అమలులో ఉందని, కాబట్టి ఆ గడువు ముగిసే వరకు జలసంధి తెరిచే ఉంటుందని వెల్లడించారు.
తమ దేశ పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ పర్యవేక్షణ, నిర్దేశకత్వం లోనే నౌకల రాకపోకలు సాగుతాయని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ పరిణామంపై స్పందించారు. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరిచిందని స్పష్టం చేశారు. ఇరాన్ తీసుకున్న నిర్ణయంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇరాన్ ఒప్పందం కుదుర్చుకునే వరకు హోర్ముజ్‌లో ఆ దేశ నౌకలను దిగ్బంధిస్తామని ట్రంప్ పేర్కొ న్నారు.
అంతేకాదు.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఇవాళో రేపో వైట్ హౌస్‌కు వచ్చే అవకాశం ఉందనీ వెల్లడించారు. ఇరాన్ తాజాగా నిర్ణయంతో అంతర్జాతీయ వాణిజ్యం ఎదుర్కొంటున్న సమస్యలకు అడ్డంకులు తొలగిపోనున్నాయి. ప్రపంచ దేశాలకు చమురు రవాణా ప్రక్రియ సజావుగా సాగనుంది.
కాల్పుల విరమణ గడువు పొడిగిస్తే, జలసంధి మరింత కాలం తెరిచి ఉంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా- ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు విజయవంతమైతే పశ్చిమాసియా లో శాశ్వత శాంతి నెలకొనే అవకాశం కూడా ఉందని వెల్లడిస్తున్నారు.
గాల్లో మేడలు కడుతున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాల్లో మేడలు కడుతున్నారని ఇరాన్ మీడియా అవహేళన చేసింది. ఇరాన్‌తో ఒప్పందానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేసింది. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్‌తో త్వరలో ఓ ఒప్పందం కుదరనుందని తెలిపారు. దీంతో వారు మాకు ఉచితంగా చమురు, హోర్ముజ్ జలసంధిని అందించనున్నారని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలను ఇరాన్ ప్రభుత్వ మీడియా ఖండించింది. ట్రంప్ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసి, గాల్లో మేడలు కడుతున్నారని పేర్కొంది. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరాన్‌ఫ ఈ వాదనలను కొట్టిపారే సింది. అలాంటి ఒప్పందం ఏదీ జరగలేదని ఇరాన్ స్పీకర్ మహ్మద్ బఘేర్ ఘాలిబఫ్ సన్నిత వర్గాలు పేర్కొన్నాయి.






