6 July, 2026 | 12:58 AM

కుల వివక్షపై అక్షరాస్త్రం ఇద్దాసు

06-07-2026 12:00 AM

“మీరయ్యవారా ?

బ్రహ్మవగన్న వారయ్య గారూ !

గజరాజుకు మారు గ్రామ సూకరిబుట్టి

గ్రామ శుద్ధి చేసి గజము నేనటియేటి

దానికీ మారూ .. మాటాడ తెలియని

వారూ దానంతవారూ.. ॥మీర॥

కామధేనువు మారు కడగోవు జన్మించి

మూతి వంచుకొని పూరి భక్షించేటి

దానితో మారు మాటాడ తెలియని

వారు దానంతవారూ ॥మీర॥” 

.. అంటూ ౨౦౦ ఏళ్ల క్రితమే నిలదీసిన అచల యోగి, తత్త్వకవి దున్న ఇద్దాసు. ఆయన చేతుల నుంచి జాలువారీని అమూల్యమైన కీర్తన ఇది. అజ్ఞానులను బావిలోని కప్పలతో, కంపగూటిలోని కాకులతో పోల్చిన తీరు అద్భు తం. ఇద్దాసు బాహ్యభక్తి కంటే అంతఃశుద్ధి ముఖ్యమని ప్రబోధించాడు. కులం కంటే గుణమే మిన్న అని వందేళ్ల క్రితమే చాటిచెప్పారంటే ఆయన ఎంతటి ధీశాలినో అర్థంచేసుకోవచ్చు. సమాజంలో చైతన్యం తెచ్చిన గొప్ప సంస్కరణవాదిగా, మానవతావాదిగా ఇద్దాసు నిలిచాడు. తెలంగాణ సాహి త్య సంస్కృతిని, సామాజిక సమైక్యతను సుసంపన్నం చేసిన అరుదైన తత్తవేత్త ఇద్దాసు. 

ఇద్దాసు ౧౮౧౮లో నల్లగొండ జిల్లా పెద్దఊర మండలం చింతపల్లి గ్రామంలో ఎల్లమ్మ, రామయ్య దంపతులకు ఆయన జన్మించాడు. బాల్యంలో అందరిలాగే పెరిగాడు. పశువుల కాపరిగా, దొరల వద్ద జీతగాడిగా పనిచేశారు. చిన్నతనంలో నాగలి దున్నడం, చెప్పులు కుట్టడం, మోకులు పేనడం వంటి పనులు చేశాడు. ప్రతిదినం ముగ్గురు సాధువులు తన ఇంటి నుంచి వెళ్లడం గమనించి వారిని అనుసరించాడు. తుంగతుర్తి శివాలయంలో వారి నామ సంకీర్తనం విని పరవశించేవాడు. ఆ సాధువులు ఇద్దాసు భక్తికి మెచ్చి నాలుక పై విభూతి రాశారు. నాటి నుంచి ఇద్దాసులో భక్తిబీజాలు మొలకెత్తాయి. 

మాదిగ మహాయోగి

ఇద్దాసును ప్రముఖ పరిశోధకుడు ఆచార్య బిరుదరాజు రామరాజు ‘మాదిగ మహాయోగి’ అని మొట్టమొద ట కీర్తించారు. మరో చరిత్రకారుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డి ఆయన్ను తెలంగాణ ‘తొలి దళిత కవి’ అని రూఢీగా ప్రకటించారు. అట్టడుగు కులాల్లో చైతన్యానికి బాటలు వేసిన మహనీయుడు ఇద్దాసు. ఈయన రచనల్లో ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఆయన లౌకిక వ్యవహార జీవితాన్ని ఆరాధించాడు. సంసారంలోనే నివృత్తిని దర్శించారు. జీవనపరంగా స్త్రీ, పురుష బేధాలను నిరసించారు. కుల, మత బేధాలను వందకు వందశాతం తిరస్కరించా డు. తత్త్వకవుల లక్షణాలు ఆయనలో పుష్కలంగా కనిపిస్తాయి. ఆయనది రాజయోగ మార్గం.

సంసారం చేస్తూనే యోగసాధన కొనసాగించాలని బోధించేవాడు. అహాన్ని చంపి, దేహంలో దీపం వెలుగుతున్నప్పుడే కర్మబంధాల ను దాటాలని పిలుపునిచ్చాడు. ఆధిపత్య కులాలు నాటి సమాజంలోని కింది కులాలను అణచివేయడంపై గళమెత్తాడు. కీర్తనలతో నిలదీశాడు. అట్టడుగు వర్గాల ప్రజలు ఆత్మన్యూనత భయం వీడి బయటకు రావాలని సందేశమిచ్చాడు. ఇద్దాసు మహిమలను అపహాస్యం చేసిన వారికి వేదాంత పరిభాషలోనే సమాధానాలు ఇచ్చాడు. ఉన్నతమైన ఉపమానాలతో సామాన్యుల మనసులను సైతం గెలుచుకున్నాడు.

ఆశుకవిగా రచనల ప్రస్థానం

ఇద్దాసు రచనల ప్రస్థానం ఆశువుగా సాగింది. ఆయన కేవలం ఒక కులానికో, ప్రాంతానికో పరిమితం కాకుండా, సమాజంలోని అంతరాలను తొలగించేందుకు ‘ఎఱుక’ అనే జ్ఞానమార్గాన్ని ఆయుధంగా చేసుకున్నాడు. నాటి సామాజిక ఆంక్షలను ధిక్కరిస్తూ, అట్టడుగు వర్గాల ఇళ్లల్లో ‘ఎల్లమ్మ భువనేశ్వరం’ పీఠాలను ప్రతిష్ఠించి, వారికి పూజాధికారాలను కల్పించాడు. తద్వారా నూతన విప్లవానికి ఆయన శ్రీకారం చుట్టాడు. ఆయన రచనల్లో ప్రస్తుతం 31 తత్త్వాలు, రెండు మేల్కొల్పులు, ఐదు మంగళహారతులు అందుబాటులో ఉన్నాయి. ఇద్దాసు సాహిత్యాన్ని పూర్వం మంత్రిగా పనిచేసిన పి.మహేంద్రనాథ్ అనే రాజకీయనేత వెలుగులోకి తీసుకుఒచ్చారు.

2018 లో దున్న విశ్వనాథం, వనపట్ల సుబ్బయ్య, ముచ్చర్ల దినకర్ కృషితో ‘తెలంగాణ వికాస సమితి’ ఇద్దాసు రచనలను పుస్తక రూపం లో ప్రచురించింది. ఇద్దాసు తన ఉర్దూ పదాలను ఉపయోగించడం ఒక విశేషం. ముసద్రీలు, సదరు, కచ్చీరు వంటి పదాలు ఆయన రచనల్లో కనిపిస్తాయి. ఇద్దాసు ప్రధానంగా భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ప్రబోధించాడు. కులాలకు అతీతంగా అప్పట్లోనే ఆయనకు వందలాది మంది శిష్యులు ఉండేవారు. ఆయన దాదాపు 108 సంవత్సరాల సుదీర్ఘ జీవితం గడిపాడు. 8 జూలై 1919న ఆయన జీవసమాధి ద్వారా భగవదైక్యం చెందాడు. 

తర్వాత కుమారుడు దున్న మల్లయ్య, మనవడు బసవలింగం ఆ పరంపరను కొనసాగించారు. ప్రస్తుతం మునిమనవడు దున్న విశ్వనాథం ఇద్దాసు పీఠాధిపతిగా కొనసాగుతున్నాడు. అయ్యవారిపల్లె కేం ద్రంగా ఇద్దాసు తత్వాలను ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నాడు. భారతదేశపు గొప్ప దళిత తత్వవేత్తల సరసన నిలవదగిన దున్న ఇద్దాసు చరిత్రలో శాశ్వత స్థానానికి అర్హుడు. 

 మధు