6 July, 2026 | 1:54 AM

పారదర్శకంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ

06-07-2026 12:57 AM

మహబూబాబాద్, జూలై 5 (విజయక్రాంతి): ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఓటర్లకు ఎస్‌ఐఆర్ నమోదులో సహకరిస్తూ, బీఎల్వోల ఇంటింటి ఫారాల పంపిణీని చేసి అవగాహన కల్పిస్తున్నట్లు మహబూబాబాద్ తహసిల్దార్ కట్టంచంద్ర రాజేశ్వరరావు తెలిపారు.

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరికి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశాల మేరకు ఆదివారం మహబూబాబాద్ పట్టణంలోని కంబాలపల్లి గ్రామంలో బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్వోలు ఓటర్లకు ఫారాల పంపిణీ, వివరాల నమోదు, అవగాహన కల్పన తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు.

ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలను అందజేయాలని, ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం పని చేయాలన్నారు. ఓటర్ల నుంచి అందిన ఫారాలను నిర్ణీత గడువులోగా స్వీకరించి, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కూడా ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొని సరైన సమాచారం అందించాలని కోరారు.