16 July, 2026 | 6:29 PM

కుదిరితే ఇసుక.. వీలెతే మట్టి!

06-06-2024 02:34 AM
  • ఆసిఫాబాద్ జిల్లాలో యధేచ్చగా వనరుల దోపిడీ

చెరువులు, ప్రభుత్వ భూముల్లో జోరుగా తవ్వకాలు  

చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

సొమ్ము చేసుకుంటున్న దళారులు, వ్యాపారులు

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 5(విజయక్రాంతి): జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక, మట్టి దందా సాగిస్తున్నారు. అనుమతులు లేకున్నా అక్రమార్కు ల ధన దాహానికి ప్రకృతి వనరులు కరిగిపోతున్నాయి. కొండలు, గుట్లలు మాయమవు తున్నాయి. పట్టా భూములు, ప్రభుత్వ భూములు, గుట్టలు అనే తేడా లేకుండా తవ్విపోస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ భూముల, గుట్టలే టార్గెట్‌గా కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా మట్టి దందా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా రాజకీయ పలుకుబడితో అధికారులకు ముడుపులు ఇచ్చి ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్నారు.

ప్రతినిత్యం అధికారుల కనుసన్నల్లోనే ఈ దందా జరుగుతున్న ఆ వైపు కనీసం కన్నెత్తి చూడడం లేదనే అరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని ఆసిఫా బాద్, వాంకిడి, రెబ్బెన, కాగజ్‌నగర్, కౌటాల మండలలతో పాటు మరిన్ని మండలాల్లో పదుల సంఖ్యలో జేసీబీ ద్వారా తవ్వి న మట్టిని ట్రాక్టర్లలో తరలిస్తున్నారు.

ఇంత జరిగిన రెవెన్యూ,మైనింగ్ అధికాకరులు చూసిచుడనట్లు వ్యవహరిస్తున్నా రు. ఇప్పటికే ఈ మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు భూముల నుంచి వేలాది సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా మట్టిని తరలించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్ మట్టిని దూరాన్ని బట్టి రూ.600 నుంచి రూ.1200 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. అయితే మట్టిని తరలించేందుకు మైనింగ్ శాఖ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి కానీ అక్రమార్కు లు ఇవేమీ పట్టించుకోవడం లేదు.

యధేచ్ఛగా ఇసుక దందా!

జిల్లాలో ఇసుక క్వారీలకు ఎలాంటి అనుమతులు లేకున్నా రెబ్బెన, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పెద్దవాగుల్లో నిర్విరామంగా తవ్వకాలు సాగుతున్నాయి. రాత్రిపూట తవ్వకాలు చేపట్టి లారీలు, టిప్పర్లలో నగరాలు, పట్టణాలకు తరలిస్తున్నారు. అనువైన ప్రాంతాలను ఎంచుకుని డంప్ చేసి.. అక్కడి నుంచి అవసరమైన వారికి అమ్ముతున్నారు.  ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతంలో ఇసుకకు డిమాండ్ ఉండడంతో రవాణాకు విరామం లేకుండా సాగుతోంది. రాత్రివేళ్లలోనే ఎక్కువగా సాగుతుండడంతో అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. పైగా వారికి నెలవారీగా మామూళ్లు చేరుతుండడం వల్ల ఇసుక, మట్టి దందాను విస్మరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఇసుక దందా వెనుక ఎక్కువగా రాజకీయ నాయకుల హస్తం ఉండడం వల్ల కూడా పోలీసులు, అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నట్లు తెలుస్తోంది.  

జిల్లాలో తొమ్మిది ప్రాంతాల్లో అనుమతి

జిల్లాలో మైనింగ్‌శాఖ ద్వారా తొమ్మిది అనుమతులు మాత్రం ఇచ్చారు. ఇందులో రెబ్బెన మండలంలోని రాళ్లపేట్, రాంపూర్‌లో తెల్లమట్టి తరలింపుకు రెండు సంస్థలకు మాత్రమే అనుమతులున్నాయి.మరో ఎడింటికి రోడ్ మెటిరీయల్,బిల్లింగ్ స్టోన్ కోసం కౌటాల ప్రాంతం నుండి మైనింగ్‌శాఖ అనుమతులు ఇచ్చారు.కానీ ఎక్కడ కూడా మట్టి,ఇసుక తవ్వకాలు అనుమతులు లేకపోయినప్పటికి యథేచ్చగా అక్రమార్కులు దోచుకుంటున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు,పర్యవరణ ప్రేమికులు కోరుతున్నారు.

నిబంధనలు పాటించుకుంటే చర్యలు తీసుకుంటాం

జిల్లాలో తొమ్మిదింటికి మాత్రమే అనుమతులు ఇవ్వడం జరిగింది. మిగితా ఎక్కడ కూడా ఇసుకకు, మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదు.ఎవ్వరైన మట్టి, ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తీసుకుంటాం.ఎవరికైన మట్టి అవసరం ఉంటే కార్యాలయంలో ధరఖాస్తు చేసుకుంటే అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. పట్టా భూముల్లోను తవ్వకాలు జరిపి ఇతర ప్రాంతాలకు తరలించడం చట్ట విరుద్ధమే. ఇసుక తరలింపుకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి.  

 -గంగధర్‌రావు, జిల్లా మైనింగ్ అధికారి, ఆసిఫాబాద్