calender_icon.png 22 December, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీ పేరు తొలగిస్తే పెద్ద ఉద్యమం

22-12-2025 02:38:21 AM

టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్

మొయినాబాద్, డిసెంబర్ 21(విజయ క్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మి దేశాన్ని లూటీ చేస్తోందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్కుమార్ గౌడ్ ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్నగర్ గ్రామంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నర్సింహ్మారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్కుమార్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చారని, గాంధీ పేరును పథకం నుంచి తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లో నుంచి గాంధీని తొలగించలేరని అన్నారు. గాంధీ పేరును ఎత్తివేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు.

2005లో యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించేందుకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. ఈ పథకం ద్వారా కూలీలు గతంలో రోజుకు రూ.80 నుంచి నేడు సుమారు రూ.450 వరకు సంపాదిస్తున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం పన్నెండేళ్ల పాలనలో ఒక్క కొత్త సంక్షేమ పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. 

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి దేశ సంపదను కొద్దిమంది చేతుల్లోకి అప్పగిస్తోందని, ఇది దేశాన్ని లూటీ చేయడమేన ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపినా బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందడమే బీజేపీ లక్ష్యమని అన్నారు.

కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు  కసిరెడ్డి నారాయణరెడ్డి, వీర్లపల్లి శంకర్, మక్కాన్ సింగ్ ఠాగూర్, టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరి సతీష్ కుమార్, టీపీసీసీ సభ్యులు షాబాద్ దర్శన్, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, ముదిరాజ్ కార్పోరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వరముదిరాజ్, నేతలు బొంతు రామోహ్మన్, చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జి పామెన భీంభరత్, చింపుల సత్యనారాయణరెడ్డి, షాబాద్ దర్శన్, జితేందర్, పారిజాత, మండల అధ్యక్షుడు మాణెయ్య, నాయకులు ప్రతాప్రెడ్డి, జైపల్రెడ్డి, వెంకట్రెడ్డి, రాంరెడ్డి, కేబుల్ రాజు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.