25 July, 2026 | 1:49 AM

పెళ్లికి పొల్లే ఉంటే జాడే సెప్పండయ్యో..

25-07-2026 12:27 AM

సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా ‘పళ్ల బురుసు’. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వినూత్న చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణానీ నిర్మాతలు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. హాస్యం, భావోద్వేగాలు, కుటుంబ బంధా లు, పల్లె జీవన శైలిని ప్రతిబింబించే పూర్తి స్థాయి వినోదా త్మక చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌నకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాట ‘కొత్త సోకు’ లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ‘ఒంటికి అత్తరు కొట్టి అగ్గో అత్తాండయ్యో.. కళ్లకు అద్దాల్ పెట్టి సిగ్గే పోతాండయ్యో.. పెళ్లికి పొల్లే ఉంటే జాడే సెప్పండయ్యో.. మాపటి లగ్గంబెట్టి ఇంటికి పంపండయ్యో.. కొత్తంగా సోకేదో అచ్చిందిరయ్యో.. మొత్తంగా ఊరంతా సోకిందిరయ్యో..’ అంటూ సాగుతోందీ గీతం.

కథానాయకుడి చలాకీతనాన్ని ప్రతిబింబించేలా రూపొందిన ఈ పాట సరదా సాహిత్యం, ఆకట్టుకునే బీట్‌తో అలరించింది. ముఖ్యంగా ‘అంగి జూడే.. ఆతడి పొంగు జూడే.. ధోతి రంగు జూడే...’ అనే హుక్‌లైన్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సురేశ్ గంగుల సాహిత్యం అందించిన ఈ పాటను సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ స్వరపర్చగా, వాగ్దేవి ఆలపించారు. వినోద్ కే బంగారి సినిమాటోగ్రఫీ, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.