20 May, 2026 | 1:51 AM

ప్రజాపాలనలో పడకేసిన ప్రజారోగ్యం

24-08-2024 02:35 AM
  1. విజృంభిస్తున్న విష జ్వరాలతో జనం అవస్థలు 
  2. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ

హైదరాబాద్, ఆగస్టు 23(విజయక్రాంతి): ప్రజాపాలన అంటూ పదే పదే గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ పాలనలో ప్రజారోగ్యం పూర్తిగా  పడకేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆరోపించారు. సీఎంతోపాటు రాష్ర్ట యంత్రాంగ మంతా ప్రజారోగ్య వ్యవస్థను గాలికొదిలేయడంతో జనం విషజ్వరాలతో మంచం పట్టే దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తంచేశారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రె డ్డికి కేటీఆర బహిరంగ లేఖ రాశారు. గత ౮ నెలలుగా పారిశ్యుద్ధ నిర్వహణ పూర్తిగా దిగజారిపోయిందని, దోమల బెడద కారణంగా డెంగ్యూ, మలేరియాతోపాటు చికున్ గున్యా లాంటి జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.  

సీజన్‌కు ముందే జాగ్రత్తలేవీ? 

వర్షాకాలానికి ముందే ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాల్సిన పాలకులు ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించారని కేటీఆర్ మండిపడ్డారు. ఫలితంగానే ఇప్పుడు ప్రజలంతా విషజ్వరాల బారిన పడే దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారుల గణాంకాల ప్రకారం ఈ ఏడాదిలో దాదాపుగా 5,700 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, అనధికారికంగా దీనికి పదింతలు ఎక్కువగానే కేసులు ఉంటాయని పేర్కొన్నారు. డెంగ్యూకి సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో ఇటీవల 50 మంది వరకు చనిపోయారని, ఇందులో చిన్నపిల్లలు కూడా ఉండటం బాధాకరమన్నారు.

మూడు రోజుల కితం డెంగీతో ఐదుగురు చనిపోయిన ఘటన కలిచివేసిందని చెప్పారు. రెండు మూడు నెలలుగా విష జ్వరాల బాధితుల సంఖ్య పెరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదని మండిపడ్డారు. ప్రభుత్వ దవాఖానల్లో సరైన సౌకర్యాలు లేక, మందుల కొరతతో పేదలు ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్తున్నారని తెలిపారు. దీనిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు దవాఖానలు పేద, మధ్యతరగతి ప్రజల జేబులు గుల్ల చేస్తున్నాయని ఆరోపించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో అటు ఆరోగ్యం ఇటు డబ్బులు పోగుట్టుకుని జనం అవస్థలు పడుతుంటే.. ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీకి రాజకీయ యాత్రలు చేయడం దారుణమని విమర్శించారు.   ప్రజల ఆరోగ్యం కన్నా తమకు తమ పార్టీ స్వప్రయోజనాలే ముఖ్యం అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఇంకెంతమంది విషజ్వరాలతో ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వంలో చలనం వస్తుందని ప్రశ్నించారు.