3 June, 2026 | 12:52 AM

అక్రమ సెల్లార్లు.. అనుమతిలేని అంతస్థులు

03-06-2026 12:19 AM

కిష్టారెడ్డిపేటలో జోరుగా నిర్మాణాలు

నామమాత్రపు తనిఖీలు.. మామూళ్ల మత్తులో అధికారులు

సంగారెడ్డి, జూన్ 2 (విజయక్రాంతి): అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో జీ ప్లస్ టూ అనుమతితో బహుళ అంతస్తులు నిర్మించడం, నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ల కట్టడాలు చేపట్టడం జోరుగా కొనసాగుతున్నాయి. కిష్టారెడ్డిపేటలో కొందరు బిల్డర్లు, రియల్టర్లు మున్సిపల్ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. తక్కువ అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకుని, క్షేత్రస్థాయిలో భారీ అపార్ట్మెంట్లు, ప్రమాదకరమైన సెల్లార్లను నిర్మించి సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారు. 

కాగితాల్లో ఒకలా.. క్షేత్రస్థాయిలో మరోలా...

భవన యజమానులు టీఎస్ బీపీఏఎస్‌ఎస్ ఆన్లైన్ విధానం ద్వారా కేవలం జీ ప్లస్ టూ నివాస గృహాల కోసం అనుమతి పొందుతున్నారు. కానీ వాస్తవ నిర్మాణానికి వచ్చేసరికి అదే అనుమతితో ఏకంగా 5 నుంచి 6 అంతస్తుల బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లను లేపుతున్నారు. చుట్టుపక్కల వదలాల్సిన కనీస స్థలాన్ని వదలకుండా పూర్తిగా రోడ్లను ఆక్రమిస్తూ, పక్క భవనాలకు తాకేలా గోడలను నిర్మిస్తున్నారు. కొన్నిచోట్ల పాత తేదీలతో చెల్లని గ్రామపంచాయతీ అనుమతులను చూపిస్తూ అక్రమ కట్టడాలను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

అనుమతి లేని ’సెల్లార్లు...

చిన్న ప్లాట్లలో జీ ప్లస్ టూ భవనాలకు సెల్లార్ తవ్వడానికి మున్సిపల్ చట్టం ప్రకారం అస్సలు అనుమతి ఉండదు. అయినప్పటికీ పార్కింగ్, కమర్షియల్ అవసరాల కోసం రాత్రికి రాత్రే సెల్లార్లను తవ్వేస్తున్నారు. ఎలాంటి సాయిల్ టెస్టింగ్ లేదా ప్రొటెక్షన్ వాల్స్ లేకుండా లోతుగా సెల్లార్లు తవ్వడం వల్ల, పక్కనే ఉన్న ఇళ్ల పునాదులు కదలి అవి కుంగిపోతున్నాయి. వర్షాకాలంలో ఈ సెల్లార్లలోకి నీరు చేరి చుట్టుపక్కల నివాసాలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. 

సామాన్యులకు ‘ఫ్లాట్ల’ విక్రయం...

అనుమతి లేని ఈ అదనపు అంతస్తులను, కమర్షియల్ స్పేస్లను అమాయక మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకు ఆశచూపి బిల్డర్లు విక్రయిస్తున్నారు. ఈ భవనాలకు మున్సిపాలిటీ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రాదు. దీనివల్ల భవిష్యత్తులో వీటికి మున్సిపల్ నీటి కనెక్షన్లు, విద్యుత్ కనెక్షన్లు రావడం కష్టమవుతుంది.

కిష్టారెడ్డిపేట, పటేల్గూడ పరిధిలో జీ ప్లస్ టూ పర్మిషన్ తీసుకుని నిర్మించిన అన్ని భవనాల అసలు ప్లాన్లను, క్షేత్రస్థాయి డ్రోన్ విజువల్స్ను అధికారులు సరిపోల్చుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఒక ఆరు అంతస్తుల అక్రమ అపార్ట్మెంట్ను హైడ్రా విజయవంతంగా కూల్చివే సింది. మిగిలిన భవనాలకు కూడా త్వరలోనే నోటీసులు జారీ చేసి, సెల్లార్లను సీజ్ చేయడానికి లేదా భవనాలను కూల్చివేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.