17 April, 2026 | 5:47 PM

జర్నలిస్టుల అక్రమ వసూళ్లు

15-01-2026 02:21 AM
  1. నిజామాబాద్ సీపీ ఆఫీసు పేరిట కాలేజీ యాజమాన్యానికి బెదిరింపులు
  2. పదిమందిపై కేసు నమోదు

నిజామాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): నిజామాబాద్ సీపీ కార్యాలయం పేరిట బెదిరింపులకు పాల్పడిన జర్నలిస్టులతో పాటు పలువురిపై నగరంలోని నాలుగవ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు పోలీసులు పదిమందిపై కేసు నమోదు చేశారు.

12వ తేదీ రియాన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆంధ్రజ్యోతి స్టాఫర్ రిపోర్టర్ అంజి, అక్షర వార్తాపత్రిక బ్యూరో హెడ్ విజయ్, అక్షర పత్రిక ఫోటోగ్రాఫర్ సురేష్, దివాకర్ టీవీ9 రిపోర్టర్, బతుకమ్మ రిపోర్టర్ గోపాల్‌తోపాటు గొల్లపల్లికి చెందిన రాజు గౌడ్, రవీందర్ గౌడ్, సుధా గోపాల్‌పై కేసు నమోదైంది.  నిజామాబాద్ నగర శివారులోని బోర్గం ప్రాంతంలో గల రియాన్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల యజమాని మహేందర్. కళాశాలలో పనిచేస్తున్న అజయ్ అనే వ్యక్తిని ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించారు.

దీంతో యజమాన్యంపై కక్ష పెంచుకున్న అజయ్.. విద్యార్థి సంఘాల నాయకులతో పాటు జర్నలిస్టులతో కలిసి కళాశాల యజమాని మహేందర్‌ను బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారు. ముందుగా ఏడు లక్షల మొత్తాన్ని అజయ్ డిమాండ్ చేయడంతో పాటు కళాశాల ఆవరణలో మద్యం సేవించి గలాటా సృష్టించాడు. ఒత్తిడికి తలొగ్గిన మహేందర్.. రూ.7 లక్షలు అజయ్‌కు చెల్లించాడు. అలాగే గత నవంబర్ 28న అక్షర వార్తాపత్రికకు చెందిన సురేష్ అనే కెమెరామెన్ రియాన్స్ ఇనిస్టిట్యూట్‌కు వచ్చి ఫొటోలు, వీడియోలు తీశాడు. మహేందర్ ప్రశ్నించగా బ్యూరో హెడ్ విజయ్‌తో ఫోన్‌లో మాట్లాడించాడు.

విద్యార్థుల ప్రవేశ కోటాను మించి అడ్మిషన్లు పరీక్షల సమయంలో మాస్క్ ఓపెనింగ్ పాల్పడుతున్నారని, దీని వల్ల సంస్థ లైసెన్సు రద్దవుతుందని విజయ్ బెదిరించి రూ.పది లక్షలు డిమాండ్ చేశాడు. ఆఖరుకు ఐదు లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో ఆంధ్రజ్యోతి స్టాఫర్ అంజి, బతుకమ్మ రిపోర్టర్ గోపాల్‌కు పంపించాలని, అలాగే పోలీస్ కార్యాలయంలోని అధికారులకూ అవసరం అని విజయ్ చెప్పాడు.

ఒప్పందం కుదిరిన మొత్తాన్ని మహేందర్ తన సోదరుడు బంటు కిషోర్ ద్వారా విజయ్, సుధాకు అందజేశాడు. డిసెంబర్ 19న ఒక విద్యార్థి సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గొల్లపల్లి చెందిన రాజుగౌడ్, రవీందర్‌గౌడ్ కూడా మహేందర్‌ను బెదిరించి రూ.రెండు లక్షలు డిమాండ్ చేయడంతో మహేందర్ రూ.లక్ష చెల్లించాడు. ఈ నెల రెండవ తేదీన మాణిక్ బండారు చెందిన మొగిలి అనే మరో వ్యక్తి మహేందర్‌కు ఫోన్ చేసి రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

దీనికి మహేందర్ నిరాకరించాడు. ఇదే నెల ఐదవ తేదీన టీవీ9 రిపోర్టర్ దివాకర్.. మహేందర్‌కు ఫోన్ చేసి బెదిరించాడు. విద్యాసంస్థపై మరిన్ని ఆరోపణలు చేయడమే కాకుండా.. ప్రస్తుతం తాను షిరిడీలో ఉన్నానని నిజామాబాద్‌కు వచ్చిన తర్వాత ఈ విషయమై చర్చించేందుకు తనను కలవాలని బెదిరించాడు. దీంతో మహేందర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు పదిమందిపై కేసు నమోదు చేశారు.