17 April, 2026 | 4:09 PM

మీ రాజకీయ వివృత క్రీడలో జర్నలిస్టులు బలి

15-01-2026 02:56 AM
  1. అరెస్టు చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలి
  2. మాజీమంత్రి హరీశ్ రావు

హైదరాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా? అని మాజీమంత్రి హరీశ్‌రావు తెంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఎక్స్ వేదికగా జర్నలిస్టుల అరెస్టుపై స్పందించారు. ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా?, జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడి అని, తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవంపై పనిగట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్షదాడి అని మండిపడ్డారు. జర్నలిస్టుల అరెస్టులు, మీడియా-, డిజిటల్ మీడియాపై సిట్లతో ఎవర్ని కాపాడుతున్నారు? ఎవరిని వేటాడుతున్నారు? అని నిలదీశారు. ‘మీ స్వార్థ రాజకీయాల’ కోసం ప్రజాస్వామ్య హననానికి పాల్పడటం దుర్మార్గమని, ‘రేవంత్‌రెడ్డి.. ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ?’ అంటూ ప్రశ్నించారు.