చేపల వేటకు వెళ్లి, మత్స్యకారుడు మృతి
బిజినేపల్లి జూన్ 14 (విజయక్రాంతి): మండలంలోని మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన సి.వెంకటయ్య(60) అనే మత్స్యకారుడు ఆదివారం మధ్యాహ్నం స్థానిక మార్కండేయ చెరువులో చేపల వేటకు వెళ్ళి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు, వెంకటయ్యలు కలిసి ఆదివారం మధ్యాహ్నం స్థానిక మార్కండేయ చెరువులో చేపల వేటకు వెళ్లారు. ఇద్దరు కలిసి చెరువులో చేపల వలను పరిచారు.
వెంకటయ్య చెరువులోకి దిగి వలను సరి చేస్తుండగా ప్రమాదశావత్తు కాళ్ళకు చుట్టుకుంది. కాళ్ళకు చుట్టుకున్న వలను వదిలించుకునే క్రమంలో వెంకటయ్య నీళ్ళల్లో మునిగిపోతున్నాడు. విషయం గమనించిన ఆంజనేయులు, స్థానిక పశువుల కాపరులు లోపలికి వెళ్ళి వెంకటయ్యను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ వెంకటయ్య ఒడ్డుకు చేరుకునే సమయానికి కొన ఊపిరితో అక్కడిక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. వెంకటయ్యకు భార్య ఆలివేళ, నలుగురు కొడుకులు ఉన్నారు.






