6 April, 2026 | 10:25 PM

పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా

06-04-2026 09:08 PM

18 క్వింటాళ్లు పట్టివేత, ముగ్గురికి రిమాండ్

కాగజ్ నగర్,(విజయక్రాంతి): కాగజ్‌నగర్‌లో రాయితీ (పీడీఎస్) బియ్యం అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా సేకరించిన బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేసి భారీగా బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడు ఆటోలలో తరలిస్తున్న మొత్తం 18 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారంతో కాగజ్‌నగర్ టౌన్ పోలీసులు ఆదివారం సాయంత్రం దాడి నిర్వహించింది. అక్రమంగా తరలిస్తున్న ఆటోలను అడ్డుకుని తనిఖీ చేయగా బియ్యం సంచులు బయటపడ్డాయి.

విచారణలో కార్డు దారుల నుంచి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఈ కేసులో సయ్యద్ సికిందర్ అలీ, షేక్ ఖాజా మొయినుద్దీన్, షేక్ ఆరిఫ్‌లను నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేశారు. నిందితులు కాగజ్‌నగర్ ప్రాంతంలోనే ఉండి ఈ అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పట్టుబడిన బియ్యం, మూడు ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. సోమవారం నిందితులను కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. తదుపరి విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాగజ్  నగర్ డీఎస్పీ  వహీదుద్దీన్ మాట్లాడుతూ పీడీఎస్ బియ్యం దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ రవాణా చేసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు.