17 May, 2026 | 2:22 AM

‘నేను రెడీ’.. స్పెషల్ సాంగ్‌తో..

17-05-2026 01:03 AM

నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో హవీష్ ప్రస్తుతం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నటిస్తున్నాడు. సినిమా చూపిస్తా మామా, నేను లోకల్, ధమాకా, మజాకా వంటి మాస్ హిట్ చిత్రాలతో ఫేమస్ అయిన త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న ఆ చిత్రమే ‘నేను రెడీ’. ఈ ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిలా కోనేరు నిర్మిస్తున్నారు. ఇందులో కావ్య థాపర్ కథానాయిక.

బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీశర్మ, వీటీవీ గణేశ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇదే చిత్రం తో బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ తెలుగులోకి అడుగు పెడుతోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తన గ్లామర్, ఆకట్టుకునే ప్రజెన్స్‌తో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన నర్గీస్..

ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాటలో కనిపించనుందని వెల్లడించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో నర్గీస్ ఫఖ్రీ రొమాంటిక్ ఫోజ్‌లో ఆకర్షిస్తోంది. విక్రాంత్ శ్రీనివాస్ కథ, స్క్రీన్‌ప్లే రాసిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా, నిజర్ షఫీ సినిమాటోగ్రాఫర్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రీ-రికార్డింగ్ పనులతో సహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.