17 May, 2026 | 2:22 AM

స్టార్స్ బొమ్మ పడకపాయే.. సమ్మర్ సంబురం లేకపాయే!

17-05-2026 01:01 AM

టాలీవుడ్‌లో వేసవి అంటే కాసుల కురిపించే పండుగ సీజన్. కానీ, ఈ ఏడాది సమ్మర్ మాత్రం సింగిల్ స్క్రీన్ థియేటర్ల పాలిట శాపంగా మారింది. మరోవైపు పెద్ద హీరోల సినిమాలు వాయిదా పడటమూ ఇందుకు కారణమని చెప్పొచ్చు. ఈ వేసవికి రావలసిన అగ్ర హీరోల చిత్రాలు సాంకేతిక కారణాలు, గ్రాఫిక్స్ పనుల వల్ల ఆలస్యమయ్యాయి. 

మే నెల సగం దాటినా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే భారీ కమర్షియల్ బొమ్మ పడలేదు. చిన్న, మధ్యతరహా చిత్రాలు కొన్ని ఆకట్టుకున్నప్పటికీ, సింగిల్ స్క్రీన్ల మనుగడకు అవసరమైన భారీ వసూళ్లను సాధించలేకపోయాయి. ఈ కారణంగా ఒకప్పుడు టాలీవుడ్‌కు గుండెకాయలా నిలిచిన సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతున్నాయి. ఓటీటీల పోటీని తట్టుకుని నిలబడాలంటే కేవలం పెద్ద సినిమాలే సరిపోవని, బిజినెస్ మోడల్‌లోనూ మార్పులు రావాలని కూడా నిరూపించిందీ వేసవి సీజన్. 

పెద్ద హీరోల సినిమాలు లేక, ప్రేక్షకులు రావడం తగ్గడంతో థియేటర్ యాజమాన్యాలకు కనీస మెయింటెనెన్స్ ఖర్చులు తప్ప డం లేదు. ఏసీ బిల్లులు, సిబ్బంది జీతాలు, కరెంట్ ఛార్జీలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నష్టాలను భరించలేక రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఎగ్జిబిటర్లు స్వచ్ఛందంగా థియేటర్లను కొన్ని వా రాల పాటు మూసివేసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లోనే పర్సంటేజీ విధానం డిమాండ్ తెరపైకి వచ్చింది.

ఇటీవల నిర్మాతలు, -ఎగ్జిబిటర్ల మధ్య నడిచిన వివాదం పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఎగ్జిబిటర్లు ప ర్సంటేజీ సిస్టమ్ అంశాన్ని తరుచూ డిస్ట్రిబ్యూటర్ల ముం దుకు తీసుకొస్తున్నా రు. ఇప్పటివరకు ఉన్న పాత పద్ధతి ప్రకా రం సినిమా ఆడినా ఆడకపోయినా థియేటర్ అద్దె ను లేదా కొంత ఫిక్స్ అ మౌంట్‌ను డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లు చెల్లించా ల్సి వచ్చేది.

చిన్న సినిమాలు ఫ్లాప్ అయితే థియేటర్ల యజమానులే పూర్తి నష్టం భరించాల్సి వస్తోంది. అదే పర్సంటేజీ విధానమైతే సిని మా బాగా ఆడితే ఎక్కువ లాభం, ఆడకపోతే నష్టం ఇరువర్గాలకు సమానంగా వర్తిస్తుంది. మల్టీప్లెక్సుల్లో ఇప్పటికే అమలులో ఉన్న పర్సంటేజీ సింగిల్ స్క్రీన్లకు కూడా వర్తింపజేస్తేనే థియేటర్లను నడపగలమని ఎగ్జిబిటర్ల సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. 

స్టార్స్ సినిమాలు ఆలస్యం 

టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలు ఆలస్యం కావడం వెనుక ఒక్కొక్కరికి ఒక్కో బలమైన సాంకేతిక లేదా ప్రణాళికాబద్ధమైన కారణాలున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ తొలుత ఈ ఏడాది సంక్రాంతికే రావాల్సింది. కానీ, ఇది వాయిదా పడటానికి ముఖ్య కారణాలు వీఎఫ్‌ఎక్స్ నాణ్యత, రీ-వర్క్ అని చెబుతూ వస్తోందీ మూవీ టీమ్. ఈ సినిమా ద్వితీయార్ధం పూర్తిగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌పైనే ఆధారపడి ఉంటుంది.

అయితే, తొలుత విడుదలైన టీజర్‌పై వచ్చిన నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ రావడం, వీఎఫ్‌ఎక్స్ నాణ్యతగా లేదంటూ వచ్చిన విమర్శల కారణంగా, అవుట్‌పుట్ అద్భుతంగా ఉండాలని చిరంజీవి స్వయంగా వీఎఫ్‌ఎక్స్ టీమ్‌ను మార్చి మరీ రీ-వర్క్ చేయిస్తున్నారు. అంతేకాకుండా రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా సంక్రాంతి బరిలో ఉండటంతో, సొంత కుటుంబ హీరోల సినిమాల మధ్య క్లాష్ రాకూడదని విడుదల తేదీని మార్చడమూ ‘విశ్వంభర’ ఆలస్యానికి కారణమే. ఇక రామ్‌చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ విడుదల కూడా పలుమార్లు వాయిదా పడింది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినప్పటికీ, అత్యుత్తమ థియేట్రికల్ అనుభవాన్ని అందించేందుకు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మేకర్స్ ఎక్కువ సమయం తీసుకుంటున్నారు.

ఏప్రిల్, మే నెలల్లో ఐపీఎల్ ప్రభావం, థియేటర్లలో ఉన్న ఇతర పోటీలను దృష్టిలో ఉంచుకుని జూన్‌కు వాయిదా వేశారు. ఇక ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు గ్లోబల్ స్టార్స్. సినిమా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కావాలి. కాబట్టి ప్రమోషన్స్, బిజినెస్ డీల్స్, వివిధ రాష్ట్రాల్లో థియేటర్ల సర్దుబాటుకు భారీ సమయం పడుతోంది. ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్‌నే అత్యంత బిజీగా, ఒకేసారి రెండు మూడు సినిమాలు సమాంతరంగా షూట్ చేస్తున్న ఏకైక హీరో. ది రాజా సాబ్, సలార్ 2, కల్కి 2 వంటి భారీ బడ్జెట్ సినిమాల వల్ల వీఎఫ్‌ఎక్స్ వర్క్‌లో జరిగే జాప్యం ఆయన సినిమాల విడుదలను వెనక్కి నెడుతున్నాయి.

‘పుష్ప-2’ మేకింగ్ కోసం దర్శకుడు సుకుమార్ ఏళ్ల తరబడి సమయం తీసుకోవడం వల్ల అల్లు అర్జున్ మార్కెట్ చాలా కాలం గ్యాప్ తీసుకుంది. ఈ ఆలస్యాల ధోరణిని గమనించిన అల్లు అర్జున్, ఇకపై ఏ సినిమాకైనా గరిష్టంగా ‘200 రోజుల రూల్‘ పెట్టుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. అంటే ఒక సినిమా ఆలస్యమైతే ఆగిపోకుండా సమాంతరంగా మరో సినిమాను లైన్‌లో పెట్టే వ్యూహాన్ని అనుసరిస్తున్నాడు బన్నీ. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ కోసం దాదాపు రెండేళ్లు కేటాయించారు. భారీ యాక్షన్ సీక్వెన్సులు, అండర్ వాటర్ షూట్స్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాల కోసం ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి రావడం వల్లే ఆయన సినిమాలు వెంటనే రావడం లేదు. అలాగే కథల ఎంపికలోనూ ఆయన చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. 

పరిష్కారం ఏంటి?

భారీ ప్రాజెక్టుల ఆలస్యం థియేటర్ల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కొందరు హీరోలు తమ పనితీరును మార్చుకుని వేగం గా సినిమాలు పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇంకొందరిలోనూ ఈ మార్పు రావాల్సి ఉంది. ముఖ్యంగా షూటింగ్‌కు వెళ్లే ముందే పూర్తి కథ, డైలాగ్స్ వంటి పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకోవాల్సి అవసరం ఉంది. సెట్స్‌పైకి వెళ్లినతర్వాత మార్పులు చేయడం వల్ల సమయం వృథా అవుతోంది. పక్కా ప్రీ-ప్రొడక్షన్ లొకేషన్లు, కాస్టింగ్, విజువల్ ఎఫెక్ట్ ప్లానింగ్‌ను, షూటింగుకు ముందే పూర్తిచేయాలి. దీనివల్ల షూటింగ్ రోజులు తగ్గుతాయి.

హాలీవుడ్ లేదా బాలీవుడ్ హీరోల తరహాలో, ఒకేసారి రెండు సినిమాలను లైన్‌లో పెట్టి, డేట్స్ అడ్జస్ట్ చేస్తూ షూటింగ్స్ పూర్తి చేయాలి. ప్రతి సినిమాకు భారీ గ్రాఫిక్స్ అవసరం లేదు. కంటెంట్ బలంగా ఉన్న కథలను ఎంచుకుంటే 6 నుంచి 8 నెలల్లో సినిమాను థియే టర్లలోకి తీసుకురావచ్చు. హీరోలు, దర్శకులు ఒక సినిమాకు గరిష్టంగా 100 నుంచి 120 రోజులు మాత్రమే షూటింగ్ డేట్స్ కేటాయించేలా ఒప్పందాలు చేసుకోవాలి. టాలీవుడ్ మార్కెట్ మరింత ఆరోగ్యకరంగా సాగాలంటే, పెద్ద హీరోలు ఏడాదికి కనీసం ఒక సినిమా లేదా రెండేళ్లకు మూడు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకోవడం అత్యంత అవసరం.