3 March, 2026 | 1:34 AM

4 దశల్లో హెల్త్ మిషన్ -100 అమలు

03-03-2026 12:00 AM

కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ రాజర్షిషా

ఆదిలాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ‘హెల్త్ మిషన్ - 100’  ప్రత్యేక ఆరోగ్య కార్యక్ర మం చేపట్టిందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మార్చి 2 నుంచి జూన్ 9 వరకు కొనసాగే ఈ బృహత్తర ‘హెల్త్ మిషన్ - 100’ కార్యక్రమం ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కౌమార దశలోని వారు, వృద్ధులకు నాణ్యమైన వైద్య సేవలను నేరుగా చేరువ చేయడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘హెల్త్ మిష న్ - 100‘ ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమంపై ఆయ న సమీక్ష సమావేశం నిర్వహించారు.   ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ మిషన్ మొత్తం నాలుగు దశల్లో అమలవుతుందని కలెక్టర్ తెలిపారు.

మొదటి దశలో భాగంగా మార్చి 31 వరకు మాతా శిశు ఆరోగ్యం, పాఠశాల విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్, వృద్ధులకు ప్రత్యేక ఓపీ సేవలు అందిస్తారు. మార్చి 27 నుండి ప్రారంభమయ్యే 2వ దశలో 30 ఏళ్లు పైబడిన వారికి బీపీ, షుగర్, క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. 3వ దశలో క్షయ, హెచ్‌ఐవి వంటి అంటువ్యాధుల నియంత్రణతో పాటు ఎండదెబ్బ నివారణ చర్యలపై అవగాహన కల్పిస్తారు. చివరిగా 4వ దశలో పట్టణ ప్రాం తాల్లోని 145 యూపీహెచ్సీలను ’పాలీ క్లినిక్లు’గా మార్చి స్పెషలిస్ట్ సేవలను అందుబా టులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

ముఖ్యంగా, ఈ 100 రోజుల్లో రాష్ట్రంలోని 42 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు 30 రకాల పరిమితులతో కూడిన డిజిటల్ హెల్త్ ప్రొఫైలింగ్ను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వా రా ఇంటి వద్దకే వైద్య సేవలు అందిస్తామని, కొత్తగా నిర్మించిన టిమ్స్ ఆసుపత్రుల ప్రారంభంతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని వివరించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.