9 April, 2026 | 2:42 AM

సమయపాలనతో మెరుగైన సేవలు

09-04-2026 12:00 AM

కలెక్టర్ కె. హరిత

బెజ్జూర్/కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటి స్తూ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కె.హరిత సూచించారు. బుధవారం బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి హాజరు పట్టిక, వార్డులు, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన వైద్యులు, పరికరాలు అందుబాటులో ఉంచి ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రోగులతో స్నేహభావంతో వ్యవహరించాలని, వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని వడదెబ్బ బాధితులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.

అలాగే సాధారణ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం గిరిజన ఆశ్రమ పాఠశాలలను సం దర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని  సందర్శించి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని, ధ్రువపత్రాల దరఖాస్తులను నిర్ణీత గడువులో జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో ప్రవీణ్ తదితర పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు..

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిని ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చి పడకల సామర్థ్యాన్ని 50 నుంచి 330కు పెంచినట్లు తెలిపారు. దీనికి అనుగుణంగా వైద్య సిబ్బంది నియామకం, అవసరమైన పరికరాల సమీకరణ జరుగుతోందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లభిస్తున్న నిధులను అత్యవసర మందులు, ఆక్సిజన్, ఇతర పరికరాల కొనుగోలుకు వినియోగిస్తున్నట్లు చెప్పారు. 

ఆసుపత్రి ప్రాంగణంలోని ఖాళీ స్థలాన్ని పార్కింగ్కు కేటాయించడం, మెడికల్ షాప్, జిరాక్స్, క్యాంటీన్ వంటి సౌకర్యాలను నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసి వచ్చే ఆదా యాన్ని ఆసుపత్రి అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. అలాగే మార్చురీ వ్యాన్, అంబులెన్స్, ఆపరేషన్ థియేటర్ పరికరాలు, సిబ్బంది నియామకానికి ప్రభుత్వానికి నివేదిక పంపాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆసుపత్రి పర్యవేక్షకులు డా. ప్రవీణ్ కుమార్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా. సుబోధ్ కుమార్, వైద్యాధి కారులు, కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.