సోలార్ వ్యవసాయ పంపులు స్కీమ్‌కు మెరుగులు
రూఫ్‌టాప్ స్కీమ్ తరహాలో పునర్‌వ్యవస్థీకరణ
న్యూఢిల్లీ, మే 17: రైతులకు సహాయపడే రీతిలో పిఎం కుసుమ్ కింద అమలవుతున్న సోలార్ వ్యవసాయ పంపులు స్కీమ్‌కు మెరుగులు దిద్దాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. పునర్‌వ్యవస్థీకరించిన సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ తరహాలోనే పోర్టల్ ద్వారా వెండార్లతో రైతుల్ని అనుసంధానించి పీఎంకుసుమ్ స్కీమ్ నేరుగా వారికి అందించాలని భావిస్తున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. దీనితో రైతులకు ఎటువంటి సోలార్ పంపులు కావాలో వారే ఎంపిక చేసుకునే వీలు కలుగుతుందని, వాటిని అమర్చడానికి పట్టే సమయం తగ్గుతుందని అధికారులు చెప్పారు. పీఎంకుసుమ్ అమలును తాము మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రస్తుతం టెండరింగ్ ప్రక్రియతో పంప్‌ల ఏర్పాటుకు ఎంతో సమయం పడుతున్నదని తెలిపారు. సోలార్ రూఫ్ టాప్ స్కీమ్‌ను పునర్‌వ్యవస్థీకరించి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించినరీతిలోనే సోలార్ పంపుల ఏర్పాటు పనిని పీఎంకుసుమ్ జాతీయ పోర్టల్‌కు అప్పగించాలన్నది ప్రణాళిక అని వారు వివరించారు.
పంపు కోసం నేరుగా ఆర్డరు
సోలార్ పంపుల కోసం పోర్టల్‌లో రిజిష్టర్ చేసుకోవడం ద్వారా వారికి అవసరమైన పంపును నేరుగా వెండార్లకు ఆర్డరు చేస్తారని, దీనితో రాష్ట్రాలు పంపుల కోసం టెండర్లు పిలిచే అవసరం తప్పుతుందని కేంద్ర ప్రభుత్వ అధికారవర్గాలు తెలిపాయి. పీఎంకుసుమ్ స్కీములో మూడు కాంపొనెంట్లు ఉన్నాయి. ఇవి.. పొలాల్లో 10,000 మెగావాట్ల సోలార్ పవర్ యూనిట్లను నెలకొల్పడం, 20 లక్షల సోలార్ వ్యవసాయ పంపుల ఏర్పాటు, 15 లక్షల వ్యవసాయ పంపుల్ని సౌర విద్యుత్ ఉత్పత్తి పంపులుగా మార్చడం. ఈ మూడు కాంపొనెంట్లకు కేంద్రం రూ.34,422 కోట్లు కేటాయించింది. కొత్త సోలార్ పంపుల ఏర్పాటు, ప్రస్తుత ఆగ్రి పంపుల సోలారైజేషన్ కోసం స్కీమును మెరుగుపర్చే చర్చలు ఇప్పుడు నడుస్తున్నాయి. సబ్సిడీలో ఎటువంటి మార్పు ఉండదని అధికారులు తెలిపారు. పీఎంకుసుమ్ స్కీమ్ కింద సోలార్ పంపుల కోసం కేంద్రం 30 శాతం, రాష్ట్రాల నుంచి కనీసం 30 శాతంగా నిర్దేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేషనల్ పోర్టల్‌కు ఎలా లింక్ చేయాలన్న అంశంపై ప్రస్తుతం కసరత్తు జరుపుతున్నట్టు అధికారులు వివరించారు.






