calender_icon.png 2 February, 2026 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో నోట్లదే అగ్రతాంబూలం!

02-02-2026 01:09:59 AM

  1. సేవకు వీడ్కోలు.. సంపదకే జై కొడుతున్న పార్టీలు
  2. అధికార, ప్రతిపక్ష అన్ని పార్టీలది ఒకే తీరు 
  3. మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తుగడలు

రంగారెడ్డి, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నగారా మోగడం తో జిల్లాలో రాజకీయ వేడి పతాక స్థాయికి చేరింది. ఈ ఎన్నిక లో సిద్ధాంతాలు, నిబద్ధత గాలికి కొట్టుకుపోతుండగా.. ’ధన బలం’ మాత్రమే అభ్యర్థుల అర్హతను డిసైడ్ చేస్తోంది. ‘ఓటుకు నోటు.. సీటుకు కోటు‘ అన్న చందంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య కార్యకర్తలు బరిలో నిలవలేక చేతులెత్తేస్తున్నారు. డబ్బే అసలైన ’గీటురాయిగా మారింది.

జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలో  ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్నగర్, శంకర్ పల్లి, మొయినాబాద్, ఆమనగల్లు మున్సిపాలిటీ లో  అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రహసనంగా మారింది. సర్వేల పేరుతో పార్టీలు హైడ్రామా ఆడుతున్నా, అంతిమంగా ఎంత ఖర్చు పెట్టగలరనే అంశానికే పెద్దపీట వేస్తున్నాయి. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసిన విధేయులకు ’ఆర్థిక స్తోమత’ లేకపోవడమే ఎన్నికలో  శాపంగా మారింది.

మున్సిపల్‌పై రియల్ గురి

 ప్రజా సేవకుల స్థానంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు రంగప్రవేశం చేస్తున్నారు.టికెట్ ఆశతో కొందరు అభ్యర్థులు తమకున్న భూములు, బంగారం తాకట్టు పెట్టి మరీ ఎన్నికల నిధిని సమకూర్చుకుంటున్నారు.వార్డుకు రూ. 60 లక్షలు.. చైర్మన్ పీఠానికి కోట్లుపైగా ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నారు. 

ఆయా మున్సిపాలిటీ లో  ఒక్కో వార్డులో సగటున 1600 నుండి 2000 మంది ఓటర్లు ఉండగా, వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు రూ. 40 లక్షల నుండి రూ. 60 లక్షల వరకు వెచ్చించేందుకు సిద్ధపడటం గమనార్హం. ఇక ప్రతిష్టాత్మకమైన చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే అక్షరాలా కోట్లు కుమ్మరించాల్సిందేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అసమ్మతి సెగలు.. జంపింగ్ జపాంగ్లు..

టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఇతర పార్టీల వైపు కన్నెత్తి చూస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీలో అసమ్మతి జ్వాలలు గట్టిగా వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్ లో అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచగా బీజేపీ బలమైన అభ్యర్థుల కోసం వేట కొనసాగిస్తోంది. ఆయా పార్టీ ల లో  బుజ్జగింపుల ప్రక్రియ కొనసాగుతుంది. ఆయా పార్టీ లో  టికెటు ఆశించి ఆశాభంగం అయిన  వారు ఎన్నికలో రెబల్స్గా మారకుండా ఉండేందుకు పార్టీలు భారీగానే తాయిలాలు ప్రకటిస్తున్నాయి. అందుకు ఇన్చార్జి మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ ఇన్చార్జీలు తమ అంచర్లను రంగంలోకి దింపారు.  

ఎత్తుకు పైఎత్తులు..

ఎలాగైనా మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవాలని ప్రధాన పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ నెల 3న గుర్తుల కేటాయింపు  ప్రక్రియ ముగియగానే ప్రచారం మరింత హోరెత్తనుంది. ప్రజాస్వామ్యం లో ఓటరు నాడి కంటే నోటు ప్రభావమే ఎక్కువగా ఉండబోతోందని తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

వార్డులు, ఓటర్ల వివరాలు

1) ఆమనగల్లులో (15) వార్డులు పురుషులు (8,475), స్త్రీలు (8,509) 

2) ఇబ్రహీంపట్నం లో  (24) వార్డులు పురుషులు (12,741) స్త్రీలు (13,252)

3) షాద్ నగర్ లో (28)- పురుషులు (26,679) స్త్రీలు (26,723)

3) శంకర్పల్లి మున్సిపాలిటీలో  

(15) వార్డులు పురుషులు  (10,551) 

స్త్రీలు (10,850)

5) చేవెళ్ల లో(18)  పురుషులు (12,579) 

స్త్రీలు (12,791)

6) మొయినాబాద్ లో ( 26 ) 

వార్డులు పురుషులు(16,419) 

స్త్రీలు (16,402)