01-02-2026 06:42:16 PM
హైదరాబాద్: నిజామాబాద్‌లో గంజాయి ముఠా చేతిలో దాడికి గురై గతవారం రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందారు. మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి చెందిన విషయం తనను తీవ్రంగా కలిచివేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకాని తనం కారణంగానే రాష్ట్రంలో గంజాయి ముఠాలు హత్యలు చేసేంతలా రెచ్చిపోతున్నాయని మండిపడ్డారు.
బంగారు భవిష్యత్తు ఉన్న సౌమ్య విధి నిర్వహణలో ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని, ఈ ఘటన ప్రభుత్వ అసమర్థ పాలనకు అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, వారికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రాష్ట్రంలో గంజాయి ముఠాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.