calender_icon.png 2 February, 2026 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భగ్గుమన్న గులాబీ శ్రేణులు

02-02-2026 01:28:28 AM

  1. మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నం 
  2. గెల్లు శ్రీనివాస్, తుంగ బాలుతో సహా పలువురి అరెస్ట్ 
  3. తెలంగాణ భవన్ వద్ద తోపులాట 
  4. సీఎం నివాసానికి వెళ్లేందుకు నేతల యత్నం 
  5. సెక్రటేరియట్ దగ్గర రేవంత్ దిష్టిబొమ్మ దహనం 
  6. కేసీఆర్ సిట్ విచారణపై హైదరాబాద్‌లో హైటెన్షన్ 
  7. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణుల శాంతియుత నిరసనలు

హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 01 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై సిట్ విచారణ సంధించడంతో గులాబీ దళం భగ్గుమంది.  కేసీఆర్ విచారణను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఇచ్చిన పిలుపుతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం ఆందోళనలతో అట్టుడికిపోయింది. మినిస్టర్ క్వార్టర్స్ నుంచి సచివా లయం వరకు, తెలంగాణ భవన్ నుంచి సీఎం నివాసం వరకు ఎక్కడికక్కడ బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసనలతో హోరెత్తించాయి.

ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ విద్యార్థి నేతలు, ఎమ్మెల్సీలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టడంతో నగరంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను అడ్డుకోవడంతో తోపులాటలు చోటుచేసుకున్నాయి.

హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేసీఆర్‌ను వేధించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో నేతలు క్వార్టర్స్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. నల్ల జెండాలు చేబూని, సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలతో పరిసరాలను దద్దరిల్లజేశారు. క్వార్టర్స్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, తుంగ బాలు సహా పలువురు ముఖ్య నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ సందర్భంగా బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 65 ఏళ్లు దాటిన వయోవృద్ధుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను పట్టుకుని సిట్ విచారణ పేరుతో వేధించడం కాంగ్రెస్ ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు.

కేవలం కేసీఆర్‌ను కాకుండా.. ఆయన కుటుంబ సభ్యులైన కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్ రావులను కూడా విచారణ పేరుతో ఇబ్బంది పెట్టడం రేవంత్ రెడ్డి సర్కార్ నీచమైన చర్య అని విమర్శించారు. రాష్ర్టంలో బొగ్గు కుంభకోణం, కాంగ్రెస్ అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ సిట్ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.  రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేని కేసీఆర్ ను ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలన.. 25 మాసాలు - 65 మోసాలుగా సాగుతోందని విమర్శించారు.  

బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద కూడా హైడ్రామా నడిచింది. అక్కడి నుంచి నేరుగా ముఖ్యమంత్రి నివాసానికి ర్యాలీగా వెళ్లేందుకు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు సహా ఇతర ముఖ్య నేతలు ప్రయత్నించారు. అయితే, పోలీసులు వారిని గేటు వద్దే అడ్డుకున్నారు. నేతలు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడం, పోలీసులు నిలువరించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ సందర్భంగా శంబీపూర్ రాజు మాట్లాడుతూ.. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే మరింత దూకుడుగా వెళ్తామని హెచ్చరించారు. తెలంగాణ సచివాలయం సెక్రటేరియట్ ముందు కూడా బీఆర్‌ఎస్ నేతలు సాహసోపేత నిరసన చేపట్టారు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కేసీఆర్ సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి అన్ని జిల్లాల కమిషనర్లు, ఎస్పీలకు అత్యవసర ఆదేశాలు వెళ్లాయి.

బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసే అవకాశం ఉన్నందున, విచారణ పూర్తయ్యేంత వరకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కాగా, కేసీఆర్‌ను సిట్ విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. 

కక్ష సాధించేందుకే కేసీఆర్‌కు నోటీసులు

తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు చేసి, రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, మాజీ సీఎం కేసీఆర్. కేసీఆర్‌కు ఎందుకు నోటీసులు ఇచ్చారని సామాన్య ప్రజలు అడుగుతున్నారు. కక్షసాధింపులో భాగంగానే కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చారు. నందినగర్ మాత్రమే సిట్ అధికారులకు తెలుసు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కేసీఆర్‌ను అవమానించాలని సీఎం రేవంత్‌రెడ్డి కంకణం కట్టుకున్నారు. కేసీఆర్ ఎక్కడ ఉంటారో సమాజం మొత్తానికి తెలుసు.

రైతు బంధు ఇచ్చినందుకు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టినందుకు కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారా? సంక్షేమానికి స్వర్ణ యుగంలా కేసీఆర్ పాలన ఉండేది. రెండేళ్ల కాంగ్రెస్ పాలన అవినీతిమయం అయింది. ఏ రంగం చూసినా అన్నీ స్కాంలే బయటపడుతున్నాయి. వాటి నుంచి డైవర్ట్ చేసేందుకే బీఆర్‌ఎస్ నాయకులను వేధిస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ సమాజం కేసీఆర్ వెంట ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు ఎటువంటి సంబంధం లేదు. రాజకీయ లబ్ధికోసం కేసీఆర్‌కు నోటీసులు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయం.

 మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ సమాజాన్ని కించపర్చడమే

తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ సమాజాన్ని కించ పరచడమే. తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. తెచ్చిన తెలంగాణను 10 యేండ్లలో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టారు. దేశం మొత్తం కేసీఆర్ వైపు చూసింది, అలాంటి నాయకుడిని రేవంత్‌రెడ్డి అవమానించారు. కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇస్తే, ప్రజలందరరూ రోడ్ల పైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేశారు.

పోలీసులు కొంతమంది అత్యుత్సాహం చూపిస్తున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ప్రభుత్వ దిష్టి బొమ్మలు తగలబెడుతుంటే మా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. కేసీఆర్ ఎక్కడ ఉంటారో అందరికీ తెలుసు. అలాంటిది నందినగర్‌కు సిట్ అధికారులు వచ్చి నోటీసులు అంటించడం బాధాకరం. మంత్రుల మధ్య వాటాల పంచాయితీ బయటకు వస్తుంటే, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు.

 మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి

రేవంత్‌రెడ్డి అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే

రేవంత్‌రెడ్డి అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకే సిట్ పేరుతో కేసీఆర్‌కు నోటీసులు. ఈ రెండేళ్లలో కేసీఆర్ పైన అభిమానం పెరిగింది తప్ప తగ్గలేదు. గారడీ విద్యలతో బీఆర్‌ఎస్‌ను ఇబ్బంది పెట్టాలని రేవంత్‌రెడ్డి చూస్తున్నారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి ఎమర్జెన్సీ కొనసాగిందో, కాంగ్రెస్ రెండేళ్ల పాలన అలానే ఉంది. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే రోడ్ల పైకి వచ్చిన ప్రజపై కేసులు పెడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయం.

 మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి 

తెలంగాణ జాతిని అవమానించడమే

సిట్ విచారణ పేరిట కేసీఆర్‌ను వేధించడం అంటే తెలంగాణ జాతిని అవమానించడమే. సిట్ తనకు తాను నిర్ణయం తీసుకుంటుందా? ముఖ్యమంత్రి చెప్పినట్లు వింటుందా? అయినా కేసీఆర్ సిట్‌కు సహకరిస్తామని చెప్పారు. పోలీసులు.. ఉద్యమకారుల ఇంటికి వెళ్లి అరెస్టు పేరిట వేధిస్తున్నారని తెలిసింది. కేసీఆర్ పాలన అంటే సంక్షేమం. కేసీఆర్ పాలన అంటే జిల్లాల ఏర్పాటు, ఆసుపత్రులు, విద్యాలయాల ఏర్పాటు, రైతు బంధు, రైతుబీమా. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణను టాప్‌లో ఉంచింది కేసీఆర్ ప్రభుత్వం.

 మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి

అప్రకటిత ఎమర్జెన్సీ తలపించేలా కాంగ్రెస్ పాలన

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రానికి ఒక్క మంచి పనీ చేసింది లేదు. ఆ పార్టీకి కక్షపూరిత రాజకీయాలు చేయడమే సరిపోతోంది. పాలన గాలికి వదిలేసి మా నాయకులపై కేసులు పెడుతున్నారు. చట్ట విరుద్ధంగా కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా సిట్ ఏర్పాటు చేశారు. రాష్ట్రాన్ని నిర్బంధంలో నడిపిస్తున్నారు. అప్రకటిత ఎమర్జెన్సీ తలపించేలా పాలన ఉంది. చట్టాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఉంటారని ప్రభుత్వానికి తెలుసు.

అయినా సిట్ అధికారులు కావాలనే నందినగర్‌లో సిట్ నోటీసులు ఇచ్చారు. సజ్జనార్‌ను ప్రశ్నిస్తున్నా.. మా పార్టీ నాయకుడు హరీశ్‌రావు అడ్రస్ సిద్దిపేటలో ఉంటే హైదరాబాద్ లో నోటీసులు ఎలా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు కీలు బొమ్మగా మారారు. పోలీసులు లైన్ దాటి పని చేస్తున్నారు. సంకుచిత ఆలోచన రేవంత్ రెడ్డిది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి ఆధారాలూ లేవు. కావాలనే ఫోన్ ట్యాపింగ్ పేరుతో డ్రామా చేస్తున్నారు. రెండేళ్లగా విచారణల పేరుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. కేసీఆర్ ఒక శక్తి, తెలంగాణ రాష్ట్రానికి ఒక మహానేత.

 ఎమ్మెల్యే కేపీ వివేకానంద