కుటుంబంలో.. డబుల్ హ్యాపీస్
ఎమ్మెల్యే, ఎంపీగా ప్రాతినిధ్యం
ఎన్నికల్లో రాణించిన జానారెడ్డి, కడియం, గడ్డం, మల్లు కుటుంబ సభ్యులు
మంత్రి పొంగులేటి వియ్యంకుడికి పట్టం
హైదరాబాద్, జూన్4 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలకు కాంగ్రెస్, బీజేపీలు చెరో 8 స్థానాలు, ఎంఐఎం ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నా యి. బీఆర్‌ఎస్ మాత్రం ఘోర పరాభావాన్ని మూటగట్టుకున్నది. ఒక కుటుంబలో ఇప్పటికే ఎమ్మెల్యేలు ఉండగా, అదే కుటుంబం నుంచి ఎంపీలుగా ఎన్నికైన వారు ఉన్నారు. వీరిలో నాగర్‌కర్నూల్ నుంచి ఎంపీగా మల్లు రవి విజయం సాధించగా, ఆయన సోదరుడు భట్టి విక్రమార్క మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఉప ముఖ్యమంత్రి గా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి నల్లగొండ నుంచి ఎంపీగా గెలుపొందగా, మరో తనయుడు జయవీర్‌రెడ్డి నాగార్జున సాగర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉండగా, ఆయన కూతురు కావ్య వరంగల్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలువగా, వంశీ తండ్రి వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వంశీ పెద్దనాన్న గడ్డం వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వియ్యంకుడు రఘురామిరెడ్డి ఖమ్మం ఎంపీగా విజయం సాధించారు.






