17 July, 2026 | 7:37 AM

నువ్వా.. నేనా?

05-06-2024 02:01 AM

రాష్ర్టంలో కాంగ్రెస్, బీజేపీ ఢీ అంటే ఢీ

కమలం, కాంగ్రెస్ హోరాహోరీ!

చెరో ఎనిమిది స్థానాల్లో గెలుపు

రెండు పార్టీల డబుల్ ఆశలు గల్లంతు

సిట్టింగ్‌ను పదిలం చేసుకున్న పతంగి

తొలిసారి ఖాతా తెరవని కారు!

తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలే సత్తా చాటాయి. కాంగ్రెస్, బీజేపీ తామే డబుల్ డిజిట్ సాధిస్తామని చెప్పుకున్నప్పటికీ అవి అంత దూరం రాలేకపోయాయి. చివరికి ఆ పార్టీలు తలా ౮ సీట్లలో విజయం సాధించాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మూడవ సార్వత్రిక ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు పీడ కలనే మిగిల్చాయి.

ఆ పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు సాధించిన బీజేపీ, పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకుందనే చెప్పాలి. అగ్రనేతల ప్రచార హోరు ఆ పార్టీకి కలిసివచ్చింది. మోదీ ఫ్యాక్టర్ రాష్ట్రంలో బాగా పనిచేసింది. కాంగ్రెస్ బలంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఆ పార్టీకి లాభం చేకూర్చాయి. హైదరాబాద్ నియోజకవర్గంలో ఎంఐఎం మరోసారి తన సత్తా చాటింది.

 చెరో ఎనిమిది స్థానాల్లో గెలుపు

రెండు పార్టీల డబుల్ ఆశలు గల్లంతు

సిట్టింగ్‌ను పదిలం చేసుకున్న పతంగి

తొలిసారిగా ఖాతా తెరవని కారు!

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి) : రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ పోరులో కాంగ్రెస్, బీజేపీ సమవుజ్జీగా నిలిచాయి. నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడిన కమలం, హస్తం పార్టీలు చివరికు తలా ఎనిమిది సీట్లలో విజయం సాధించాయి. తెలంగాణలోనే సమైక్య ఏపీ పరంగా చూసినా బీజేపీకి తొలిసారిగా 8 సీట్లు వచ్చాయి. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాల్లో దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి ఇప్పుడు తన సత్తా చాటింది.

హైదరాబాద్ విషయానికి వస్తే ఎంఐఎం వరుసగా 11వ సారి గెలిచి సత్తా చాటింది. ఆది నుంచి గట్టి పోటీ ఇచ్చిన రెండు జాతీయ పార్టీలే తెలంగాణలో తమ సత్తా చాటాయి. ఇక మొదటి నుంచి డబుల్ డిజిట్ సాధిస్తామంటూ బీరాలు పలికిన కాంగ్రెస్, బీజేపీ అంత దూరం రాలేకపోయాయి. మరోవైపు తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మూడో సార్వత్రిక ఎన్నిక బీఆర్‌ఎస్ పార్టీ పీడ కలనే మిగిల్చింది. ఆ పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. తెలంగాణ నుంచి తలా 8సీట్లతో జాతీయ స్థాయిలో ప్రభావం చూపేందుకు కాంగ్రెస్, బీజేపీ సిద్ధమయ్యాయి. 

కమలనాథుల డబుల్ డిజిట్ ప్రచారం

ఈ లోక్ సభ ఎన్నికలపై బీజీపే ఆది నుంచి ప్రత్యేక దృష్టి సారించింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 20 శాతం ఓట్లు 4 సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ, ఈ సారి మాత్రం గతంలో ఎప్పుడు లేనివిధంగా డబుల్ డిజిట్ సాధించాలనే ధీమాతోనే పోటీలో నిలిచింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 9 స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటిన బీఆర్‌ఎస్.. ఈ సారి కనీసం బోణీ చేయలేకపోవడం బీజేపీకి కలిసివచ్చింది. బీఆర్‌ఎస్ కోల్పోయే ఓటింగ్ శాతం దాదాపుగా బీజేపీకి కలిసివచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. ఈసారి తమకు డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని కమలనాథులు ఊహించారు.

కానీ 8కే పరిమితం అయ్యారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్‌తో పాటు మెదక్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌లో బీజేపీ విజయం సాధించింది. బీఆర్‌ఎస్ పార్టీ మెదక్‌లోనైనా విజయం సాధిస్తుందేమోనని ఆ పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నా చివరకు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈ స్థానం నుంచి తొలిసారిగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.

ఆదిలాబాద్ నుంచి గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన సోయం బాపూరావును కాదని జి. నగేష్‌ను బీజేపీ బరిలో నిలిపి సక్సెస్ అయ్యింది. ఇక గత ఎన్నికల్లో విజయం సాధించిన ధర్మపురి అరవింద్ (నిజామాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), జి.కిషన్ రెడ్డి (సికింద్రాబాద్) మరోసారి విజయం సాధించారు. మహబూబ్ నగర్ నుంచి బీజేపీ తరఫున వరుసగా రెండోసారి పోటీ చేస్తున్న డీకే అరుణ తొలిసారిగా విజయం సాధించారు. మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్ సైతం తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు. చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించి సత్తా చాటారు. 

బీజేపీ విజయానికి కారణాలివే..

రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా బీజేపీ 8 సీట్లు కైవసం చేసుకునడం అంటే మామూలు విషయం కాదు. ఆ పార్టీ ఈ ఎన్నికల్లో పూర్తిగా హిందుత్వంపైనే ఆధారపడింది. ఈ ఏడాదిలోనే దాదాపు పదిసార్లు తెలంగాణకు మోదీ వచ్చారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణపై ప్రత్యేక నజర్ వేసి ప్రచారం చేశారు. ప్రచారంతో పాటు అనేక అంశాలు బీజేపీకి కలిసివచ్చాయి. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేయాలంటూ బీజేపీ చేసిన ప్రచారం కలిసి వచ్చినట్లే కనిపిస్తోంది. మరోవైపు అయోధ్యలో రామాలయ నిర్మాణం కూడా పార్టీకి ప్లస్‌గా మారినట్లు తెలుస్తోంది. 

ఇక రజాకార్లపై చేసిన పోరాటాన్ని హిందూ అనుకూల ఉద్యమంగా బీజేపీ వినిపించడమే కాకుండా సెప్టెంబర్ 17వ తేదీన విమోచన దినంగా కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా బీజేపీ యువ ఓటర్లను ఆకర్షించడంలో సఫలమైంది. ఎంఐఎంకు వ్యతిరేకంగా హిందూ ఓటర్లను బీజేపీ ఆకర్షించింది. విభజన తర్వాత తెలంగాణలో ఖాళీ అయిన టీడీపీ చాలా వరకు బీఆర్‌ఎస్‌లో చేరింది. క్షేత్రస్థాయిలో ఆర్‌ఎస్‌ఎస్ బలంగా పని చేయడమే కాకుండా ఎక్కడెక్కడ లోపాలున్నాయో వివరిస్తూ ఎప్పటికప్పుడు అభ్యర్థులను అలర్ట్ చేసింది.

జాతీయ ఎన్నికలు కావడంతో... రెండు జాతీయ పార్టీల మధ్య జరిగిన పోరులో బీఆర్‌ఎస్ ప్రభావం చూపలేకపోయింది. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ స్థానాన్ని బీజేపీ దక్కించుకోగలిగింది. మోదీ ఫ్యాక్టర్ కూడా తెలంగాణలో చాలా బలంగా పని చేసింది. పార్టీ క్యాడర్‌తో పాటు ఈటల రాజేందర్, బండి సంజయ్, కొండా విశ్వశర్వ రెడ్డి, డీకే అరుణ లాంటి నాయకుల సొంత ఛరిష్మా కూడా బీజేపీకి ప్లస్ పాయింట్‌గా మారింది. 

కాంగ్రెస్ పార్టీకి అధికారం కలిసి వచ్చింది

సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని ఎంతో గొప్పగా చాటుకునే పరిస్థితి ఉండేది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. 2014 ఎన్నికల్లో కేవలం 2, 2019 ఎన్నికల్లో 3 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరినిచ్చింది. ఆ పార్టీ ఈ ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటిందనే చెప్పాలి. బీజేపీ లాగే కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం తమకు డబుల్ డిజిట్ వస్తుందంటూ ప్రచారం చేశారు.

14 సీట్ల వరకు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కానీ 8 స్థానాల వద్దే ఆగిపోయారు. పెద్దపల్లిలో తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చిన ఎమ్మెల్యే వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌పై గెలిచారు. నల్గొండ నుంచి మాజీ మంత్రి, కాంగ్రెస్ కురువృద్ధుడు జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ సైతం తొలిసారి బరిలో దిగి రాష్ట్రంలోనే భారీ మెజారిటీతో విజయం సాధించారు. భువనగిరిలో చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఖమ్మంలో రామసహాయం రఘురామిరెడ్డి, వరంగల్‌లో కడియం కావ్య కూడా తొలిసారిగా పోటీ చేసి విజయం సాధించినవారి జాబితాలో చేరారు.

జహీరాబాద్‌లో సురేష్ షెట్కార్, నాగర్ కర్నూలులో మల్లు రవి, మహబూబాబాద్‌లో బలరాం నాయక్ మరోసారి పార్లమెంట్ గడప తొక్కుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండటం కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసివచ్చింది. ముఖ్యంగా పార్టీ విజయం సాధించిన ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. పెద్దపల్లి, నల్గొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్, ఖమ్మం, జహీరాబాద్, వరంగల్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికంగా ఉండటం కూడా ఎంపీ అభ్యర్థుల విజయానికి కలిసివచ్చింది. 

వరుసగా పదోసారి పతంగి

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అంటేనే ఎంఐఎం అనే విధంగా పరిస్థితి మారిపోయింది. తొలిసారిగా 1984లో ఎంఐఎం పార్టీ అప్పటి అధ్యక్షుడు సుల్తాన్ సలాఉద్దీన్ ఒవైసీ తొలిసారిగా హైదరాబాద్ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 1989, 1991, 1996, 1998, 1999 వరకు వరుసగా 6 సార్లు ఆయన ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2004లో తొలిసారి ఎంపీగా గెలిచిన సలాఉద్దీన్ కుమారు అసదుద్దీన్ ఆ తర్వాత 2009, 2014, 2019, 2024లోనూ విజయం సాధించి సత్తా చాటారు. 1984లో ఎంఐఎం చేతిలోకి వెళ్లిన తర్వాత హైదరాబాద్‌లో ఒక్కసారి కూడా వేరే పార్టీకి గెలుపు అవకాశం రాలేదంటే పతంగి ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున మాధవీలత గట్టి పోటీ ఇచ్చినట్లు కనిపించినా చివరకు రెండో స్థానానికే పరిమితం కాక తప్పలేదు.

తొలిసారి ఖాతా తెరవని కారు...

రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ సత్తా చాటింది. ఎవరికీ అందని రీతిలో 11 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటింది. ఆ తర్వాత 2019లోనూ 9 స్థానాలతో తన స్థాయిని నిలబెట్టుకుంది. కానీ మూడోసారి మాత్రం పూర్తిగా పతనమైపోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఖాతా తెరవలేకపోయింది. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ పార్టీ తర్వాత క్రమంగా వెనుకంజ వేయడం ప్రారంభమైంది. బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీల కూటములకు దూరంగా ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ సొంతంగా 17 స్థానాల్లో పోటీ చేసి ఒక్క చోట కూడ గెలవకపోవడం ఆ పార్టీని ఎంతో కలవరపాటుకు గురి చేస్తోంది.