మహర్షి విద్యాలయ నూతన భవనం ప్రారంభం
- విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
- చేవెళ్ళ ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల, జులై 9 (విజయక్రాంతి): మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన, విలువలతో కూడిన విద్యను అందించడమే విద్యాసంస్థల లక్ష్యంగా ఉండాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల పట్టణంలో నూతనంగా నిర్మించిన ‘మహర్షి విద్యాలయ‘ భవనాన్ని గురువారం మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతా వెంకట్రెడ్డి, మాజీ సర్పంచి, ప్రస్తుత కౌన్సిలర్ బండారు శైలజ అగిరెడ్డి, పాఠశాల చైర్మన్ చిరుమని జైపాల్రెడ్డి, కరస్పాండెంట్ ప్రభాకర్తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... చేవెళ్ల నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి వసతులతో విద్యాసంస్థలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. పుస్తకాలకే పరిమితమైన విద్య కాకుండా విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత యాజమాన్యాలు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
మహర్షి విద్యాలయం చేవెళ్ల ప్రాంతంలో మంచి గుర్తింపు సాధించాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతా వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు విద్యాసంస్థలే బలమైన పునాది అన్నారు. అనంతరం ఎమ్మెల్యే నూతన భవనంలోని తరగతి గదులు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.






