మీ సేవ ఛార్జీల పెంపు
- 40 నుంచి 50% వరకు.. ఉత్తర్వులు జారీ
- పేద వర్గాలపై అదనంగా ఆర్థిక భారం
హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి) : రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాల్లో పలు సేవలపై సర్వీసు ఛార్జీలను పెం చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మీ సేవ కేంద్రాల నిర్వహణ ఖర్చు లు గణనీయంగా పెరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రాల నిర్వాహకుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకు ని ఈ కొత్త ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. దాదాపు అన్ని కీలక సేవలపై 40 నుంచి 50 శాతం వరకు పెంపు చోటుచేసుకుంది.
తాజా నిర్ణయం ప్రకారం ఆదాయ ధ్రువీకరణ పత్రం ఫీజు రూ. 55 నుంచి రూ. 80కు పెరిగింది. అలాగే కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం కూడా ఇదే విధంగా రూ. 80కు పెరిగాయి. ఇక జనన ధ్రువీకరణ పత్రం ప్రింట్ ఫీజు రూ.45 నుంచి రూ.62కు పెంచారు. ఈ పెంపు ప్రభావం ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగార్థులపై పడనుంది. విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే సమయంలో ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా అవసరం అవుతాయి.
ఇప్పుడు ఈ మూడు పత్రాలకు ఒక్కోటి రూ. 80 చెల్లించాల్సి రావడం వల్ల మధ్యతరగతి, పేద వర్గాలపై అదనపు ఆర్థిక భారం పడనుంది. మరోవైపు, మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. పెరిగిన విద్యుత్ బిల్లులు, ఇంటర్నెట్ ఖర్చులు, సిబ్బంది జీతాలు వంటి నిర్వహణ వ్యయాలు అధికమవడంతో సర్వీసు ఛార్జీల పెంపు తప్పనిసరి అయిందని వారు చెబుతున్నారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌ను ప్రభుత్వం ఇప్పుడు పరిష్కరించిందని అభిప్రాయపడుతున్నారు.
అయితే, ఒకేసారి ఇంత భారీగా ఛార్జీలు పెరగడంపై సామాన్య ప్రజలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ప్రజలకు అవసరమైన ప్రాథమిక సేవలపై ధరలు పెరగడం సరైన నిర్ణయం కాదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని పలువురు కోరుతున్నారు.




