దేవాలయ ప్రాంగణంలో మైనర్ బాలిక పట్ల అసభ్య ప్రవర్తన
66 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసిన ఆర్‌సీ పురం పోలీసులు.
రామచంద్రాపురం: దేవాలయ ప్రాంగణంలో మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆరోపణలపై 66 ఏళ్ల వ్యక్తిని రామచంద్రాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల ప్రకటన ప్రకారం.. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్‌నగర్ కాలనీలోని ఓ దేవాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. 13-08-2026న రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్‌నగర్ కాలనీలోని ఓ దేవాలయంలో పనిచేస్తున్న వడ్ల సాయన్న అలియాస్ సైలూ అనే వ్యక్తి మైనర్ బాలికతో దేవాలయంలో అసభ్యకర రీతిలో ఉన్నట్లు కొందరు శ్రీనివాస్‌నగర్ కాలనీ వాసులు గమనించారు. ఈ విషయంపై 14-08-2026న రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా, క్రైమ్ నంబర్ 505/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా నిందితుడిగా గుర్తించిన వడ్ల సాయన్న అలియాస్ సైలూ (66), శ్రీనివాస్‌నగర్ కాలనీ, రామచంద్రాపురం, సంగారెడ్డి నివాసిని పోలీసులు 15-08-2026న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.మైనర్ బాలిక వివరాలు వెల్లడించవద్దు.ఈ ఘటనలో బాధితురాలు 18 సంవత్సరాల లోపు మైనర్ బాలిక కావడంతో ఆమె గోప్యత, వ్యక్తిగత హక్కులను కాపాడటం అత్యంత ముఖ్యమని పోలీసులు స్పష్టం చేశారు. బాధిత బాలిక ఫొటో, వీడియోలు, పేరు, చిరునామా లేదా ఆమెను గుర్తించేందుకు వీలయ్యే ఇతర వివరాలను ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా లేదా ఇతర ప్రజా వేదికలపై ప్రచురించడం, ప్రసారం చేయడం, షేర్ చేయడం చట్టవిరుద్ధమని పోలీసులు హెచ్చరించారు.అందువల్ల బాధిత బాలిక గుర్తింపును బయటపెట్టే ఎలాంటి వివరాలను ప్రచురించకుండా మీడియా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు.






