15 April, 2026 | 6:41 PM

ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు భేటీ.. డీలిమిటేషన్‌పై చర్చ

15-04-2026 04:07 PM

న్యూఢిల్లీ: పార్లమెంటు ప్రత్యేక మూడు రోజుల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల చట్టంపై అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించేందుకు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి( INDIA AILLANCE) నేతలు సమావేశమయ్యారు. ఖర్గే తన నివాసంలో పార్టీ పార్లమెంటరీ వ్యూహ బృందం సమావేశాన్ని ఏర్పాటు చేయగా, ఈ భేటీలో కాంగ్రెస్ అగ్ర నాయకులు మహిళా రిజర్వేషన్ల అంశంతో పాటు నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై కూడా చర్చించారు.

మహిళా రిజర్వేషన్ల చట్టం, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం మంగళవారం ఎంపీలకు పంపిణీ చేసింది. ఏదైనా బిల్లు వెనుక ఉన్న ఉద్దేశం దురుద్దేశపూరితంగానూ, దానిలోని అంశాలు కుటిలమైనవిగానూ ఉన్నప్పుడు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి కలిగే నష్టం అపారంగా ఉంటుందని కాంగ్రెస్ ఆరోపించింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు పొడిగించబడ్డాయి. ఏప్రిల్ 16 నుండి 18 వరకు మూడు రోజుల పాటు సభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. 

ఈ సమావేశాల సందర్భంగా సాధారణంగా మహిళా రిజర్వేషన్ చట్టంగా పిలువబడే 'నారీ శక్తి వందన్ అధినియం'ను 2029లో అమలు చేసేందుకు అవసరమైన సవరణలు కేంద్ర ప్రవేశపెట్టనుంది. చివరగా ప్రచురించిన జనాభా లెక్కల ఆధారంగా చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అనంతరం, 2029 పార్లమెంటు ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలులోకి తీసుకురావడానికి, ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల సంఖ్యను 850 వరకు పెంచనున్నారు.

పార్లమెంటు రాబోయే ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న రాజ్యాంగ సవరణ బిల్లు ముసాయిదా ప్రకారం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల్లోని స్థానాలను కూడా పెంచనున్నారు. మహిళా రిజర్వేషన్ల, డీలిమిటేషన్ బిల్లుపై పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లుల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు పలువురు నేతలు వ్యతిరేకిస్తుండగా, బీజేపీ నేతలు వారి వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.