దుమ్ము రేగుతోంది!
అసంపూర్తి రోడ్లతో అవస్థలు
కేసముద్రం, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో గత కొన్నేళ్ల క్రితం చేపట్టిన రోడ్ల విస్తరణ పనులు ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. కోరుకొండ పల్లి క్రాస్ రోడ్డు నుండి అంబేద్కర్ సెంటర్ వరకు, మహాత్మ జ్యోతిబాపూలే సెంటర్ నుండి పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు, అలాగే పొట్టి శ్రీరాములు సర్కిల్ నుండి గాంధీ సెంటర్ వరకు, ఇక బైపాస్ రోడ్డు, ఉప్పరపల్లి రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు.
ఇందులో మహాత్మ జ్యోతిబాపూలే సెంటర్ నుండి పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు మాత్రమే రోడ్డు విస్తరించి తారు రోడ్డు వేశారు. డివైడర్ నిర్మించి కొంత అక్కడక్కడ పని అలాగే వదిలేశారు. ఇక మిగిలిన రోడ్లలో ఉప్పరపల్లి రోడ్డు కొంతమేర పూర్తి చేశారు. కోరుకొండ పల్లి క్రాస్ రోడ్డు నుండి అంబేద్కర్ సెంటర్ వరకు, బైపాస్ రోడ్డు, పొట్టి శ్రీరాములు సర్కిల్ నుంచి గాంధీ సెంటర్ వరకు రోడ్డు నిర్మాణ పనులు కంకరతో వదిలేశారు. దీనితో పట్టణంలోని ప్రధాన రహదారులు దుబ్బతో మారిపోతున్నాయి.
రోడ్లపై నీళ్లు చల్లుతున్నప్పటికీ ఎండలకు వెంటనే ఆరిపోవడంతో దుబ్బ యధావిధిగా చెలరేగుతోంది. అలాగే కంకర చిందరవందరగా మారి వాహనాలు వెళ్ళే సమయంలో ప్రమాదకరంగా మారింది. రహదారుల విస్తరణ పనులను అసంపూర్తిగా వదిలేయడంతో వాహన దారులతోపాటు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపై పలుచోట్ల విద్యుత్ స్తంభాలను అలాగే వదిలేశారు. దుబ్బ ధూళితో జనం సతమతమవుతున్నారు.
గంటసేపు రోడ్డు పక్కన వాహనాలు నిలిపితే తిరిగి వచ్చి చూస్తే గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ రోడ్డు కూడా పూర్తిస్థాయిలో విస్తరించకపోవడం, బైపాస్ రోడ్డు వినియోగంలోకి రాకపోవడం, పట్టణంలో రోడ్లు సగం విస్తరించి సగం వదిలేయడం వల్ల ఇరుకుగా మారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అభివృద్ధి పేరుతో ఉన్న రోడ్లను తొలగించి, పనులు పూర్తి చేయకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి అసంపూర్తి రోడ్లను వెంటనే పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.






