3 August, 2026 | 2:47 AM

39 పతకాలతో ముగింపు

03-08-2026 01:38 AM

గ్లాస్గోలో భారత్‌కు 4వ స్థానం

బాక్సర్లదే పైచేయి

ఓవరాల్‌గా మంచి ప్రదర్శనే

గ్లాస్గో, ఆగస్టు 2 : కామన్‌వెల్త్ గేమ్స్ 2026ను భారత్ 39 పతకాలతో తమ ప్రయాణాన్ని ముగించింది. పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సారి 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలు వచ్చాయి. గత నాలుగు ఎడిషన్లతో పోలిస్తే పతకాలు తగ్గినా ఇది అత్యుత్తమ ప్రదర్శనగానే చెప్పాలి. ఎందుకంటే ఈ సారి కామన్ వెల్త్ గేమ్స్‌లో చాలా క్రీడాంశాలు తొలగించారు. భారత్ కు ప్రతీసారీ ఖచ్చితంగా మెడల్స్ అందించే రెజ్లింగ్, షూటింగ్ , టెన్నిస్, టీటీ, క్రికెట్, రగ్బీ, స్క్వాష్ వంటివి లేవు. దీంతో కేవలం 10 క్రీడాంశాలతోనే గ్లాస్గో గేమ్స్ నిర్వహించారు.

పెద్దగా అంచనాలు లేని పారా అథ్లెట్లు సైతం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ వంటి మేజర్ ఈవెంట్లలో మన క్రీడాకారులు అదరగొట్టి అద్భుత విజయాల ను అందించారు. ముఖ్యంగా భారత బాక్స ర్లు ఏడు స్వర్ణాలతో సరికొత్త రికార్డు నెలకొల్పారు. మహిళల బాక్సింగ్‌లో ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా గంగాస్, అరుంధతి చౌదరి, పురుషు బాక్సింగ్ లో సచిన్ సివాచ్, అంకుశ్ ఫంగల్ బంగారు పతకాలు సాధించారు.

వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయిచాను, జూడోలో అస్మిత్ దే, హర్ష సింగ్, పారా అథ్లెకిట్స్ మహిళల షాట్ పుట్‌లో షర్మిల ధనకర్, పురుషుల షాట్ పుట్‌లో సోమన్ రాణా స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. క్రీడాంశాల పరంగా చూస్తే అథ్లెటిక్స్‌లో 5 రజతాలు, 5 కాంస్యాలు, పారా అథ్లెటిక్స్‌లో 3 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం , జూడోలో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం వచ్చాయి. అలాగే వెయిట్ లిఫ్టింగ్‌లో 1 స్వర్ణం, 6 రజతాలు, 1 కాంస్యం, పారా పవర్ లిఫ్టింగ్ లో 1 కాంస్యం, బాక్సింగ్‌లో 7 స్వర్ణాలు, 3 రజతాలు దక్కాయి.

2010 న్యూఢిల్లీ వేదికగా జరిగిన గేమ్స్ లో 101 పతకాలు లభించగా, తర్వాత గ్లాస్గో వేదికగానే జరిగిన 2014 ఎడిషన్ లో 64 పతకాలు వచ్చాయి. ఇక 2018 గోల్ కోస్ట్ గేమ్స్ లో భారత బృందం 66 పతకాలు గెలుచుకుంది. 2022 బర్మింగ్ హామ్ లోనూ 60 పతకాలు సాధించింది.  గ్లాస్గో గేమ్స్‌లో ఆస్ట్రేలియా 171 పతకాలతో అగ్రస్థానం సాధించగా, ఇంగ్లాండ్ 101 పతకాలతో రెండో స్థానంలోనూ, 62 పతకాల తో కెనడా 3వ స్థానంలోనూ నిలిచాయి.