9 July, 2026 | 2:30 PM

తగ్గిన పారిశ్రామికోత్పత్తి

11-05-2024 01:01 AM

మార్చిలో వృద్ధి 4.9 శాతానికి పరిమితం

ముంబై, మే 10: దేశంలో పరిశ్రమలు మళ్లీ మందగించాయి. ఈ ఏడాది మార్చి నెలలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు 4.9 శాతానికి తగ్గినట్టు శుక్రవారం విడుదలైన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. మైనింగ్ రంగం ఉత్పత్తి పేలవంగా ఉండటమే ఇందుకు కారణం. 2024 ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి సూచి (ఐఐపీ) వృద్ధి 5.6 శాతం ఉండగా, మార్చిలో ఈ వృద్ధి 4.9 శాతానికి మందగించింది. 2023 మార్చి వృద్ధి రేటు 1.9 శాతంతో పోలిస్తే ఈ మార్చి లో గణనీయంగా పెరిగింది. 2023 24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఐఐపీ వృద్ధి 5.8 శాతానికి చేరినట్టు కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.

2022 ఈ వృద్ధి రేటు 5.2 శాతంగా ఉన్నది. ఈ ఏడాది మార్చి నెలలో మైనింగ్ ఉత్పత్తి వృద్ధి రేటు 6.8 శాతం నుంచి 1.2 శాతానికి తగ్గగా, తయారీ రంగం వృద్ధి 1.5 శాతం నుంచి 5.2 శాతానికి పెరిగింది. విద్యుదుత్పత్తి ఈ మార్చిలో 8.6 శాతం పెరిగింది. గత ఏడాది మార్చిలో ఇది 1.6 శాతం. తయారీ రంగంలో క్యాపిటల్ గూడ్స్ విభాగం వృద్ధి రేటు 10 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గగా, వినియోగ వస్తువుల వృద్ధి రేటు 9.5 శాతానికి పెరిగింది. గత ఏడాది ఈ విభాగం వృద్ధి 8 శాతం క్షీణించింది. కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి 4.9 శాతం పెరిగింది. నిరుడు ఈ విభాగం 1.9 శాతం క్షీణతను చవిచూసింది.